బాలల హక్కుల రక్షణకు కలిసి పనిచేయాలి
అల్లిపురం: బాలల రక్షణ చట్టాలను సమర్థంగా అమలు చేయడానికి పోలీసు, న్యాయవ్యవస్థ, పౌర సమాజం మధ్య బలమైన సమన్వయం అవసరమని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి స్పష్టం చేశారు. నగర పోలీస్ కమిషనరేట్, వాసవ్య మహిళా మండలి సంయుక్త ఆధ్వర్యంలో నగర పోలీస్ సమావేశ మందిరంలో శనివారం ‘పోక్సో చట్టం–బాలల రక్షణ చర్యల బలోపేతం’అనే అంశంపై ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోక్సో చట్టం అమలు వ్యూహాలపై సమాజంలో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ‘మనం ఒంటరిగా మైలురాళ్లను మాత్రమే సాధించగలం.. కానీ అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే బాధితులకు న్యాయం, రక్షణతో కూడిన భవిష్యత్తును అందించగలం’ అని పిలుపునిచ్చారు. బాలల హక్కుల పరిరక్షణలో భాగస్వామ్య వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ.. కోర్టు విచారణ ప్రక్రియలో ఎదురయ్యే సవాళ్లు, సాక్ష్యాల సేకరణలో ఇబ్బందులు, విధానపరమైన జాప్యం వంటి అంశాలను వివరించారు.
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం : ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల కనీస అవగాహన పెంచుకోవాలని నగర పోలీస్ కమిషనర్, విశాఖ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పిలుపునిచ్చారు. శనివారం వీసీఎస్ ఆధ్వర్యంలో ప్రో–విజిల్ సంస్థలో సైబర్ భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ బాగ్చి మాట్లాడుతూ సాంకేతికతతో ముడిపడి ఉన్న నేటి ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను వివరించారు. ఉద్యోగులు తమ డిజిటల్ భద్రత కోసం వ్యక్తిగత, వృత్తిపరమైన జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అన్నారు. ఏదైనా సైబర్ నేరం జరిగి తే, బాధితులు 1930కు కాల్ చేయాలని సూచించారు. అసోసియేట్ డైరెక్టర్ సీమా సిక్రి మాట్లాడుతూ.. భవిష్యత్‌లో కార్పొరేట్ సంస్థల కోసం మరిన్ని అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. విశాఖలోని ఐటీ కమ్యూనిటీ భద్రతకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో కీలకమని సైబర్ సెక్యూరిటీ జాయింట్ సెక్రటరీ కిశోర్ దాసరి అభిప్రాయపడ్డారు.


