
రైల్వేస్టేషన్‌లో 2.2 కిలోల బంగారం స్వాధీనం
తాటిచెట్లపాలెం : వాల్తేర్ డివిజన్ క్రైమ్ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ స్క్వాడ్(సీపీడీఎస్) బృందం సభ్యులు అనధికారికంగా బంగారం రవాణా చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం 11.30 సమయంలో సీపీడీఎస్, వాల్తేర్ సభ్యులు ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్, సిబ్బందితో కలిసి రైల్వేస్టేషన్‌లో తనిఖీలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు గేట్ నెంబర్ 4 వద్ద బ్యాక్‌ప్యాక్ బ్యాగ్‌తో సంచరించడం గమనించి తనిఖీ చేశారు. అందులో మరుధర్ ఎక్స్‌ప్రెస్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్(లాజిస్టిక్ సర్వీస్) పేరిట రెండు కార్టన్ బాక్స్‌లు ఉన్నాయి. వారిని విచారించగా మధ్యప్రదేశ్‌కు చెందిన హరేంద్రసింగ్, రాజస్థాన్‌కు చెందిన హరి గోవింద్‌లని తెలిపారు. వారు ఈ కొరియర్‌ను బ్రహ్మపూర్ నుంచి విశాఖ తీసుకువచ్చినట్లు చెప్పారు. అనుమానించిన ఆర్పీఎఫ్ సిబ్బంది స్టేట్ జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ మంజుల, ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ బారుణ్‌కుమార్ బెహరాలకు సమాచారం అందించారు. వారి సమక్షంలో బాక్స్‌లను తెరిచి చూడగా 2.20 కిలోల బంగారం స్వాధీనం ఉంది. దీని విలువ రూ.2.20 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే కొన్ని ఈ ట్యాక్స్ ఇన్‌వాయిస్‌లు ఉన్నాయని, ఇందులో కొన్ని వాస్తవమైనవి కాగా మరికొన్ని నకిలీ పత్రాలని గుర్తించారు. జీఎస్టీ నిబంధనలను అతిక్రమించడంతో రూ.7 లక్షలు జరిమానా విఽధించారు.