
సేవలో తరించి..సేవతోనే ముగించి
ఆర్టీసీ బస్‌లో ప్రయాణిస్తూ
గుండెపోటుతో వ్యక్తి మృతి
స్వచ్ఛంధ సంస్థలో కీలక సభ్యుడిగా వ్యవహరిస్తున్న రాజేష్
మరణం తరువాత అతని నేత్రాలు దానం చేసిన కుటుంబ సభ్యులు
పెందుర్తి: మనిషి జీవితం ఎప్పుడు ఎలా ముగుస్తుందో ఎవరూ ఊహించలేరు. కానీ కొంతమంది జీవితం మాత్రం ఇతరుల కోసం అంకితమై ఉంటుంది. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామానికి చెందిన సయ్యపురెడ్డి రాజేష్ (రాజా) (42) అలాంటి కోవకు చెందినవారు. అగ్రి కల్చర్ మార్కెటింగ్ కమిటీలో ఉద్యోగం చేస్తూనే..‘అమ్మ హెల్పింగ్ హార్ట్స్’ స్వచ్ఛంధ సేవా సంస్థలో క్రియాశీలక సభ్యుడిగా వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపారు. అతని జీవిత ‘ప్రయాణం’ సేవతో మొదలై, సేవతోనే ముగిసింది.
మంగళవారం మధ్యాహ్నం, చోడవరం నుంచి విశాఖ నగరానికి ఆర్టీసీ బస్సులో బయలుదేరిన రాజేష్‌ను విధి వెంబడించింది. పెందుర్తి మండలం రాంపురం వద్దకు రాగానే ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తోటి ప్రయాణికులు వెంటనే స్పందించి బస్సు ఆపారు. బస్సు కండక్టర్ మురళీకృష్ణ వెంటనే రాజేష్‌కు సీపీఆర్ చేయగా, డ్రైవర్ వాసు సమయస్ఫూర్తితో బస్సును పెందుర్తిలోని ప్రభుత్వ ఆస్పత్రి (సీహెచ్‌సీ)కి వేగంగా తరలించారు. కానీ వైద్యులు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే రాజేష్ గుండెపోటుతో మృతి చెందాడు.
మరణంలోనూ మానవత్వం..
నలుగురికి వెలుగులు
రాజేష్ మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు.. ‘అమ్మ హెల్పింగ్ హార్ట్స్’ ట్రస్ట్ ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెందుర్తి ఆస్పత్రికి విషాదంతో తరలివచ్చారు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలను గుర్తు చేసుకుని కంటతడిపెట్టారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పెందుర్తిలోని ‘సాయి హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్’ వ్యవస్థాపకుడు దాడి శ్రీనివాస్ అక్కడికి చేరుకున్నారు. రాజేష్ నేత్రాలను దానం చేయమని ఆయన కుటుంబ సభ్యులను కోరారు. వారి కోరికను అర్థం చేసుకున్న రాజేష్ తల్లిదండ్రులు వరహాలబాబు, స్వర్ణకుమారి గొప్ప మనసుతో అంగీకరించారు. ‘మా కుమారుడు జీవించి ఉన్నప్పుడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. ఇప్పుడు లేడు. అతని నేత్రాలు నలుగురికి ఉపయోగపడతాయంటే మాకు ఏ అభ్యంతరం లేదు’ అని వారు కన్నీళ్లతో తెలిపారు. వారి అంగీకారంతో, ‘మోషిన్ ఐ బ్యాంక్’ ప్రతినిధి అజయ్ బృందం రాజేష్ నేత్రాలను (కార్నియా) సేకరించారు. నిస్వార్థంగా సేవ చేస్తూ తన జీవితాన్ని అంకితం చేసిన రాజేష్, మరణానంతరం కూడా నలుగురి జీవితాల్లో వెలుగులు నింపి చరిత్రలో నిలిచిపోయాడు.

సేవలో తరించి..సేవతోనే ముగించి