
శ్లాబ్ పెచ్చులూడి తల్లీబిడ్డకు గాయాలు
స్థానికుల సహాయంతో కేజీహెచ్‌కు తరలింపు
జగదాంబ: జీవీఎంసీ 35వ వార్డు దుర్గమాంబ సమాజం వీధిలోని ఓ ఇంటి శ్లాబ్ పెచ్చులూడి పడటంతో తల్లీకూతురుకు గాయాలయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాల వల్ల ఇల్లు బాగా తడిసిపోయింది. ఆ ఇంట్లో నివాసం ఉంటున్న ముద్దా భువనేశ్వరి తన 13 నెలల కుమార్తెతో కలిసి మంగళవారం అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా శ్లాబ్ పెచ్చులు ఊడి వారి మీద పడ్డాయి. ఈ ప్రమాదంలో తల్లీకూతుళ్లిద్దరికీ కాలిపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు వారిని కేజీహెచ్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ వార్డు అధ్యక్షుడు కనకరెడ్డి ప్రమాదానికి గురైన తల్లీబిడ్డలను పరామర్శించారు.
ఏఎస్‌డబ్ల్యూవో నిర్లక్ష్యం
200 మందికి వేతనాల
చెల్లింపులో జాప్యం
తగరపువలస: పాయకరావుపేట ఏఎస్‌డబ్ల్యూవో నిర్లక్ష్యం కారణంగా ఆగస్టు నెలకు సంబంధించి విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని సుమారు 200 మంది సాంఘిక సంక్షేమ వసతిగృహాల సిబ్బంది జీతాలు ఆలస్యం కానున్నాయి. సాంఘిక సంక్షేమ శాఖలో ఏపీసీవోలుగా పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల డ్యూటీ సర్టిఫికెట్లు ప్రతి నెలా 25లోగా విశాఖ, అనకాపల్లి జిల్లాలకు చెందిన భీమిలి, విశాఖపట్నం, నర్సీపట్నం, అనకాపల్లి, పాయకరావుపేట ఏఎస్‌డబ్ల్యూవోలు విశాఖలోని సాంఘిక సంక్షేమశాఖకు పంపించాలి. గత నెలలో నలుగురు ఏఎస్‌డబ్ల్యూవోలు డ్యూటీ సర్టిఫికెట్లు పంపించగా, పాయకరావుపేట నుంచి ఏఎస్‌డబ్ల్యూవో పంపించలేదు. ఫలితంగా సాంఘిక సంక్షేమశాఖలోని ఏపీసీవోలు, వార్డెన్లు, డిప్యూటీ డైరెక్టర్లు, సూపరింటెండింగ్ సిబ్బంది, ఇతర సిబ్బంది కలిపి సుమారు 200 మందికి జీతాలు నిలిచిపోయాయి. వీరి కి ప్రతి నెలా ఒకటో తేదీకి జీతాలు అందవలసి ఉండగా, ఇప్పుడు 15రోజులు ఆలస్యమయ్యేలా ఉంది. ఏపీసీవోల డ్యూటీ సర్టిఫికెట్ల పంపించడంలో జాప్యం చేసిన ఏఎస్‌డబ్ల్యూవోకు గత నెల 30న డిప్యూటీ డైరెక్టర్ మెమో జారీ చేశారు. దీనిపై మూడు రోజులలోగా లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

శ్లాబ్ పెచ్చులూడి తల్లీబిడ్డకు గాయాలు