
11న స్టీల్‌ప్లాంట్ ఈవోఐ, ప్రైవేటీకరణ రద్దు కోసం సభ
డాబాగార్డెన్స్: ఈవోఐ పేరిట విశాఖ స్టీల్‌ప్లాంట్ అమ్మకాన్ని బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం తక్షణం నిలిపేయాలని సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు డిమాండ్ చేశారు. ప్లాంట్ పరిరక్షణ కోసం ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు పాతగాజువాకలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సభకు సీపీఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హాజరవుతారని చెప్పారు. విశాఖలోని సీపీఎం కార్యాలయంలో ఆ పార్టీ విశాఖ కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌కేఎస్‌వీ కుమార్, పి.మణి, బి.జగన్, వి.కృష్ణారావులతో కలిసి బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించి, చట్ట విరుద్ధంగా తొలగించిన 5 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలన్నారు. వారి స్థానంలో ఇతర రాష్ట్రాల కార్మికుల నియామకాన్ని ఆపాలన్నారు. ప్లాంట్‌లోని 6 వేల ఉద్యోగ ఖాళీల్ని భర్తీ చేసి, నిర్వాసితులకు పర్మినెంట్ ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు, కార్మికులకు పూర్తి జీతాలు చెల్లించాలన్నారు. సీఎం చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అవాస్తవ ప్రకటనలతో తమ ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు, రాష్ట్ర ప్రజలకు చేస్తున్న ద్రోహాన్ని కప్పిపెట్టడం ఆపి, విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించి, పరిరక్షించేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని హితవుపలికారు.