
భక్తి ముసుగులో వ్యాపారానికి బ్రేక్
111 అడుగుల వినాయక మండపానికి విద్యుత్ సరఫరా కట్
దర్శనాలు నిలిపివేసిన అధికారులు
అనుమతులు రద్దూ చేస్తూ జీవీఎంసీ కమిషనర్ ఉత్తర్వులు
ముగిసిన సుందర వస్త్ర మహాగణపతి
ఉత్సవాలు
గాజువాక : భారీ విగ్రహం పేరుతో గాజువాకలో వినాయక ఉత్సవాలను ప్రారంభించిన నిర్వాహకులకు అధికారులు షాకిచ్చారు. భక్తి ముసుగులో వ్యాపారానికి తెరలేపారన్న ఫిర్యాదులపై స్పందించిన అధికారులు వినాయక ఉత్సవాన్ని ముగించాలని నిర్వాహకులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సంబంధిత మండపానికి విద్యుత్ సరఫరా నిలిపివేసి భక్తులను అక్కడ్నుంచి పంపించేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఎస్‌వీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరుతో పాతగాజువాకలోని లంకా మైదానంలో 111 అడుగుల భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. లక్ష చీరలతో సుందర వస్త్ర మహాగణపతి పేరిట ఉత్సవాలను గత నెల 27న ప్రారంభించారు. 21 రోజులపాటు ఉత్సవాలను నిర్వహించడం కోసం జీవీఎంసీ నుంచి సింగిల్ విండో ప్రాసెస్‌లో నిర్వాహకులు అనుమతి తీసుకున్నారు. అయితే భక్తి ముసుగులో వ్యాపారానికి తెరలేపారని, కమర్షియల్‌గా టికెట్లు అమ్మడం, పార్కింగ్‌కు ఫీజు వసూలు చేయడం, దుకాణాలు పెట్టించి డబ్బులు వసూలు చేశారంటూ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదులపై స్పందించిన అధికారులు నిర్వాహకులకు నోటీసులను కూడా అందజేశారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఉత్సవాల నిర్వహణ కోసం ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తూ జీవీఎంసీ కమిషనర్ గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. పోలీసులు, విద్యుత్ సిబ్బంది సహకారంతో మండపానికి, అక్కడి దుకాణాలకు సంబంధించిన విద్యుత్ కనెక్షన్లను తొలగించారు. దర్శనాలను నిలిపివేసిన పోలీసులు మండపాన్ని మూసేసి భక్తులను అక్కడ్నుంచి పంపించేశారు. గాజువాక లంకా మైదానంలో వినాయక ఉత్సవాలు ముగిశాయని అధికారవర్గాలు ఈ సందర్భంగా పేర్కొన్నాయి.
కోటి లింగాల గణపతి మండపానికి కూడా..
గాజువాక ఆర్టీసీ డిపో సమీపాన కోటి శివలింగాలతో 108 అడుగుల ఎత్తయిన భారీ వినాయక విగ్రహ మండపానికి కూడా జీవీఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వాహకులు వ్యవహరించడంపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు.

భక్తి ముసుగులో వ్యాపారానికి బ్రేక్