
క్యాన్సర్ రహిత రాష్ట్రమే లక్ష్యం
మహారాణిపేట: ఆంధ్రప్రదేశ్‌ను క్యాన్సర్ రహిత రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. కేజీహెచ్ క్యాన్సర్ చికిత్సా కేంద్రంలో సుమారు రూ.42 కోట్లతో సమకూర్చిన అధునాతన వైద్య పరికరాలను, స్క్రీనింగ్ యంత్రాలను ఆయన సోమవారం ప్రారంభించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఈ నిధులు మంజూరైన విషయం విదితమే. పరికరాల్లో లీనియర్ యాక్సిలరేటర్ (రూ.25 కోట్లు), సిటీ సిమ్యులేటర్ (రూ.9.5 కోట్లు), బ్రాకీథెరపీ (రూ.7.5 కోట్లు) ఉన్నాయి. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఇక్కడ సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల, క్యాన్సర్ రోగులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చేదన్నారు. ఇక నుంచి కేజీహెచ్‌లో ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. కేజీహెచ్‌తోపాటు కర్నూలులో కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, దీనికి గాను కేంద్రం ఇప్పటికే నిధులు కూడా కేటాయించిందని వివరించారు. క్యాన్సర్ లక్షణాలున్న వారిని గుర్చేందుకు త్వరలో ప్రత్యేక సర్వే చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, పి.విష్ణుకుమార్ రాజు, ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ వైస్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, స్థానిక కార్పొరేటర్ అప్పలరత్నం, డీఎంఈ డాక్టర్ రఘునందన్, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి, అడ్మినిస్ట్రేటర్ బీవీ రమణ, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి, సీఎస్ ఆర్‌ఎంవో డాక్టర్ శ్రీహరి, ఆంకాలజీ విభాగం వైద్యాధికారులు పాల్గొన్నారు.
క్యాన్సర్ వల్ల ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోయాను
క్యాన్సర్ మహమ్మారి వల్ల తమ కుటుంబంలో ముగ్గురు వ్యక్తులను కోల్పోయానని వైద్య కళాశాల సెంటినరీ భవనంలో వైద్య విద్యార్థులు, వైద్యులతో జరిగిన మీట్–గ్రీట్‌లో మంత్రి సత్యకుమార్ భావోద్వేగానికి గురయ్యారు. అమ్మ, సోదరుడు, అక్క వేర్వేరు సమయాల్లో ప్రాణాలు విడిచారని వివరించారు. ఈ ఘటనలు తనను ఎంతగానో కలచివేశాయన్నారు.