
కాపర్ స్టేవ్స్ దొంగతనం కేసులో పురోగతి
ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్‌లోని బ్లాస్ట్‌ఫర్నేస్ విభాగంలో జరిగిన స్టేవ్స్ దొంగతనం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించినట్లు తెలిసింది. సుమారు 1200 కిలోల బరువు గల ఆరు కాపర్ స్టేవ్స్ కనిపించకపోవడంపై గత నెల 28న ప్లాంట్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన క్రైం పోలీసులు నలుగురు అనుమానితులను విచారించినట్లు తెలిసింది. వారి నుంచి అందిన సమాచారం మేరకు, పోలీసులు మంగళవారం రెండు స్టేవ్స్‌ను సీఆర్‌ఎంపీ ఆర్‌ఈడీ స్టోర్స్ సమీపంలోని పొదల్లో గుర్తించారు. వాటిని అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నాలుగు స్టేవ్స్‌ను ప్లాంట్ గేటు బయటకు తరలించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసు విచారణలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని, ఒకటి రెండు రోజుల్లో కేసు మొత్తం కొలిక్కి వస్తుందని పోలీసు వర్గాలు తెలిపాయి.