కొమ్మాది: సాగరతీరంలో నిర్మిస్తున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ భవనాన్ని మంగళవారం సాయంత్రం కేంద్ర పరిశీలనా బృందాలు సందర్శించాయి. బేపార్కు కొండ దిగువన, బీచ్ రోడ్డుకు ఆనుకుని దాదాపు రూ.30 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ భవన నిర్మాణ పనులు ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతాయని, త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి వస్తుందని చీఫ్ సైంటిస్ట్ ఇన్‌చార్జ్ డాక్టర్ వీవీఎస్ ఎస్. శర్మ తెలిపారు. ఎన్‌ఐవో డైరెక్టర్ సునీల్ కుమార్ సింగ్ , కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ చీఫ్ ఇంజినీర్ అతుల్ కుమార్ గోయల్ భవన నిర్మాణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే భవనానికి వెళ్లే రహదారి కొండ వాలులో ఉండటం వల్ల, రహదారి మలుపుల వద్ద బలమైన రక్షణ గోడ నిర్మించాలని వారు సూచించారు. ఈ పరిశోధనా కేంద్రంలో ఓషన్ ఫిజిక్స్, సముద్ర అధ్యయనం, పర్యావరణం, ఖనిజ అన్వేషణ, పారిశ్రామిక పరిశోధన వంటి కీలకమైన అధ్యయనాలు జరుగుతాయని పేర్కొన్నారు. భారతదేశంలో ఉన్న 38 ప్రయోగశాలల్లో విశాఖపట్నంలోని ఇది ఒకటి అని వారు తెలిపారు.