
కేంద్ర కారాగారంలో హెచ్‌ఐవీ పరీక్షలు తప్పనిసరి
మహారాణిపేట: జిల్లా కేంద్ర కారాగారంలో ఖైదీలందరికీ తప్పనిసరిగా హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. హెచ్‌ఐవీ పాజిటివ్ ఉన్నవారికి సకాలంలో మందులు అందజేయాలని సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా హెచ్‌ఐవీ, ఎయిడ్స్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. హెచ్‌ఐవీతో జీవిస్తున్నవారి హక్కులను కాపాడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. హెచ్‌ఐవీపై అవగాహన కోసం త్వరలో నిర్వహించనున్న మారథాన్ ‘రెడ్ రన్’ను విజయవంతం చేయాలని జిల్లా స్పోర్ట్స్ అధికారిని ఆదేశించారు. జిల్లాలో ఉన్న ట్రాన్స్‌జెండర్లందరికీ ప్రభుత్వ పథకాలను వర్తింపజేయాలని దివ్యాంగుల సంక్షేమ అధికారికి సూచించారు. హెచ్‌ఐవీ బాధితులకు ఎన్టీఆర్ పింఛన్లను సకాలంలో అందజేయాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జగదీశ్వర్ రావు, ఇతర ఉన్నతాధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.