
‘స్థాయీ’కి రూ.5 లక్షలు..!
● స్టాండింగ్ కమిటీ ఎన్నికల బరిలో ఉన్న సభ్యుల నుంచి వసూలు ● కీలక నేత చేతికి 10 మంది నుంచి రూ.50 లక్షలు ● ఎన్నికకు ముందు సభ్యులకు పంచేందుకు ఈ డబ్బు?
విశాఖ సిటీ: జీవీఎంసీ ‘స్థాయీ’ రేటు ఫిక్స్ అయింది. ఎన్నికల్లో సభ్యులకు పంపకాలకు ‘ప్రత్యేక’ నిధులను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకోసం స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో సీటు కొట్టిన వారి నుంచి రూ.5 లక్షల చొప్పున రూ. 50 లక్షలు వసూలు చేశారన్న టాక్ చక్కర్లు కొడుతోంది. జీవీఎంసీలో ఒక కీలక నేత రంగంలోకి దిగి స్వయంగా ఒక్కో సభ్యుడి నుంచి వసూలు చేశారన్న గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎన్నికకు ముందు రోజు ఒక్కో సభ్యుడికి ఈ నిధుల నుంచే పంపకాలు చేపట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. జీవీఎంసీలో స్థాయీ సంఘం ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ నుంచి 9 మంది, బీజేపీ నుంచి ఒకరు నామినేషన్ వేశారు. 11వ సభ్యుడిగా జనసేన కార్పొరేటర్ మహమ్మద్ సాధిక్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే అతడికి అవకాశం లేనట్లు తెలుస్తోంది. మంగళవారంతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. ఆగస్టు 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకావం ఉంది. ఆగస్టు 6వ తేదీన స్థాయీ సంఘం ఎన్నికలు జరగనున్నాయి. స్థాయీ సంఘం సభ్యులుగా నామినేషన్లు వేసిన వారి నుంచి డబ్బు వసూలు అంశం ఇప్పుడు జీవీఎంసీలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నిక ముందు కార్పొరేటర్లకు కొంత మొత్తాన్ని ముట్టజెప్పి టీడీపీ, బీజేపీ అభ్యర్థుల విజయానికి అవసరమైన ఓట్లు సాధించే పనిలో నిమగ్నమయ్యారు.