అతిథి ఎంపికలో అయోమయం | - | Sakshi
Sakshi News home page

అతిథి ఎంపికలో అయోమయం

Jul 30 2025 6:40 AM | Updated on Jul 30 2025 6:40 AM

అతిథి ఎంపికలో అయోమయం

అతిథి ఎంపికలో అయోమయం

● ఏయూలో అతిథి అధ్యాపకుల భర్తీ ● రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ లేకుండా నోటిఫికేషన్‌ ● ఆగస్టు 1 నుంచి ఇంటర్వ్యూల నిర్వహణకు సన్నద్ధం ● తరగతులు జరగక విద్యార్థుల ఆందోళన

మద్దిలపాలెం: వందేళ్ల ఘన చరిత్ర కలిగిన ఆంధ్రా యూనివర్సిటీలో అతిథి అధ్యాపకుల నియామక ప్రక్రియ గందరగోళంగా మారింది. అధికారుల సమన్వయ లోపం, అనాలోచిత నిర్ణయాలతో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించకుండా నోటిఫికేషన్‌ విడుదల చేయడం, ఇంటర్వ్యూల నిర్వహణలో జరుగుతున్న పరిణామాలు.. అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీని వల్ల విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా.. తరగతులు జరగక విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.

నోటిఫికేషన్‌పై విమర్శలు

ఏయూ అధికారులు అతిథి అధ్యాపకుల నియామకాలకు సంబంధించి రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ను విస్మరించి వెబ్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఏఏ విభాగంలో ఎన్ని పోస్టులున్నాయి? వాటిలో ఏయే రిజర్వేషన్లకు ఎన్ని కేటాయించారన్న వివరాలను పొందుపరచలేదు. ఇది నియమావళికి విరుద్ధమని, ప్రస్తుతం ఏయూలో అతిథి అధ్యాపకులుగా పనిచేస్తున్న సుమారు 400 మంది భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కొందరు అభ్యర్థులు ఉన్నత విద్యామండలికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

1,100 దరఖాస్తుల స్వీకరణ

ఆదరాబాదరగా విడుదల చేసిన ఈ వెబ్‌ నోటిఫికేషన్‌కు గడువు ముగిసే నాటికి సుమారు 1,100 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఏయూలో పనిచేస్తున్న వారితో పాటు కొత్త అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. సగటున ప్రతి డిపార్ట్‌మెంట్‌కు కనీసం 10 దరఖాస్తులు అందినట్లు తెలుస్తోంది. అయితే ఇంజనీరింగ్‌ కళాశాలకు చాలా తక్కువ దరఖాస్తులు రాగా.. కొన్ని విభాగాలకు అసలు దరఖాస్తులే రాలేదని సమాచారం. ఆరు నెలల (సెమిస్టర్‌) కాలానికి రూ.45,000 వేతనంగా చెల్లిస్తుండటంతో చాలామంది దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.

అందుకేనా.. వేర్వేరు ప్రాంతాల్లో.?

ఆగస్టు 1 నుంచి 4వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ, వాటి నిర్వహణపై పూర్తి గందరగోళం నెలకొంది. గతంలో ప్రిన్సిపాల్‌ కార్యాలయంలోనే అతిథి అధ్యాపకుల ఇంటర్వ్యూలు నిర్వహించేవారు. కానీ ఈ సారి వేర్వేరు ప్రాంగణాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మొదట ప్రిన్సిపాల్‌ కార్యాలయం, తర్వాత రిజిస్ట్రార్‌ కార్యాలయం అని ప్రచారం జరిగింది. అభ్యర్థులంతా ఒకే చోట చేరితే సమస్యలు తలెత్తవచ్చనే ఉద్దేశంతో వేర్వేరు ప్రాంతాల్లో ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

సమన్వయలోపంతోనే..

ఏయూలో వీసీ, అధికారులు సమన్వయంతో పని చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి. అతిథి అధ్యాపకులందరికీ న్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలి. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని అతిథి అధ్యాపకుల నియామకం పారదర్శకంగా, ఏయూ నిబంధనల ప్రకారం చేపట్టాలి.

– డాక్టర్‌ ఎం.సురేష్‌ మీనన్‌, అధ్యక్షుడు, ఏయూ అధ్యాపకుల సంఘం

వందేళ్ల చరిత్రలో..

ఆంధ్ర యూనివర్సిటీలో కొత్త విద్యా సంవత్సరం జూలై ఒకటో తేదీ నుంచి ప్రారంభమైంది. దాదాపు నెల రోజులు కావస్తున్నా.. టైం టేబుల్‌ విడుదల కాలేదు. అధ్యాపకులు తరగతులకు వెళ్లడం లేదు. అతిథి అధ్యాపకుల నియామక ప్రక్రియ జాప్యం, ఒప్పంద అధ్యాపకులు అగ్రిమెంట్‌ పేరుతో తరగతులకు వెళ్లకపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. వందేళ్ల చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నెల రోజులుగా తరగతులు నిర్వహించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొదటి సెమిస్టర్‌ సమయం ఆసన్నమవుతుండటంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

రోజుకో మాట

ఏయూ ఆర్ట్స్‌ కళాశాలలకు సంబంధించి విజయనగరం ప్యాలెస్‌, అంబేడ్కర్‌ ఆడిటోరియం, ఇంజనీరింగ్‌ కళాశాలకు సంబంధించి జియోఫిజిక్స్‌, సైన్స్‌, లా, ఫార్మసీ కళాశాలలకు సంబంధించి అంబేడ్కర్‌ ఆడిటోరియంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు అభ్యర్థులకు ఈ మెయిల్‌ ద్వారా సమాచారం ఇచ్చారు. అయితే ఎంపిక కమిటీ కూర్పుపై అధికారులు రోజుకో సమాచారం ఇస్తున్నారు. గతంలో వీసీ ఆధ్వర్యంలో సిక్స్‌ మెన్‌ కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించింది. ప్రస్తుతం ప్రిన్సిపాల్‌ చైర్మన్‌గా, హెచ్‌వోడీలు, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌, ఎక్స్‌టర్నల్‌ సభ్యులుగా ఉంటారని ఒకసారి, ఫ్యాకల్టీ చైర్మన్‌, హెచ్‌వోడీ, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌, ఎక్స్‌టర్నల్‌ సభ్యులుగా ఉంటారని మరోసారి, హెచ్‌వోడీ, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌, ఫ్యాకల్టీతో పాటు ఎక్స్‌టర్నల్‌ ఉంటారని ఇంకోసారి ప్రచారం జరిగింది. అయితే సంబంధిత ప్రిన్సిపాల్‌, హెచ్‌వోడీలకు తెలియకుండానే కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రిన్సిపాల్‌ పేరుతోనే నోటిఫికేషన్‌ విడుదలైనందున.. ఆయన లేకుండా ఎంపిక కమిటీని ఏర్పాటు చేయడం చట్ట ప్రకారం సరైంది కాదని వర్సిటీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement