
నగరాన్ని గాలికొదిలేశారు.!
● దేశంలోనే కాలుష్యం పెరిగిన నగరాల్లో రెండో స్థానంలో వైజాగ్ ● 2024–25లో నగరంలో 32.9 శాతం పెరిగిన వాయు కాలుష్య స్థాయిలు ● గత పదేళ్లలో కాలుష్య నియంత్రణకు రూ.129.4 కోట్లు మంజూరు చేసిన కేంద్రం ● ఇప్పటివరకు రూ.39 కోట్లు మాత్రమే ఖర్చు చేసిన రాష్ట్రం ● వైఎస్సార్ సీపీ హయాంలో కాలుష్య నియంత్రణకు అధిక మొత్తం వినియోగం ● కూటమి అధికారంలోకి వచ్చాక మహా నగరంపై నిర్లక్ష్యం
సాక్షి, విశాఖపట్నం: మనిషి మనుగడకు స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, ఆరోగ్యకరమైన ఆహారం అత్యవసరం. వీటిలో ఏది లోపించినా అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం ఇదే పరిస్థితి. మరి మన మహానగరం విశాఖపట్నం సురక్షితమేనా అంటే, కాదనే సమాధానం వినబడుతోంది. విశాఖలో కాలుష్యం గణనీయంగా పెరిగి, ప్రాణ వాయువు కొరవడుతోంది. కేంద్ర ప్రభుత్వ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్‌సీఏపీ)లో భాగంగా.. దేశవ్యాప్తంగా 130 నగరాల్లో కాలుష్య స్థాయిలు ఎలా పెరుగుతున్నాయనే అంశంపై అధ్యయనం చేసింది. 2024–25లో సంపూర్ణ డేటాని సేకరించి.. నివేదిక విడుదల చేసింది. మొత్తం 130 నగరాల్లో అత్యంత ఎక్కువగా కాలుష్యం పెరిగిన జాబితాలో ఔరంగాబాద్ మొదటి స్థానంలో ఉండగా.. విశాఖ రెండో స్థానంలో ఉంది. కాలుష్యం పెరిగిన నగరాల జాబితాలో విశాఖ రెండో స్థానానికి చేరడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా, నగర కాలుష్యంపై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడమే ఈ దుస్థితికి కారణమని ప్రస్తుత గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
2024–25 నుంచి 32.9 శాతం పెరుగుదల
దేశంలో వాయు కాలుష్యం పెరిగిన నగరాల్లో విశాఖపట్నం రెండో స్థానంలో నిలిచిందని జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం (ఎన్‌సీఏపీ) అధ్యయనం వెల్లడించింది. 2019లో ప్రారంభించిన ఈ కార్యక్రమం, 2017–18 నాటి పీఎం 10 స్థాయిలను ప్రామాణికంగా తీసుకుని అంచనా వేసింది. ఎన్‌సీఏపీ గణాంకాల ప్రకారం, 2024–25లో విశాఖ నగరంలో కాలుష్యం 32.9 శాతం పెరిగింది. ఇది గతంలో ఎన్నడూ లేనంత దారుణమని నివేదిక పేర్కొంది. పీఎం 10 సాంద్రత 101 మైక్రోగ్రామ్స్‌పర్ క్యూబిక్ మీటర్‌కు చేరడం ఆందోళన కలిగించే అంశంగా హెచ్చరించింది. మొదటి స్థానంలో ఉన్న ఔరంగాబాద్‌లో 33.3 శాతం గాలి నాణ్యత క్షీణించింది. విశాఖతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం సహా 13 నగరాల్లో వాయు కాలుష్యం గణనీయంగా పెరిగినట్లు ఈ అధ్యయనం తేల్చింది.
కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే..
2019లో ప్రారంభమైన కాలుష్య నియంత్రణ ప్రాజెక్టులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, విజయవాడ, కర్నూలు, కడప, అనంతపురం సహా 13 నగరాలను ఎంపిక చేశారు. ఈ నగరాల్లో గాలిలో దుమ్ము, వాహన ఉద్గారాలు, పారిశ్రామిక కాలుష్యం నియంత్రణపై దృష్టి సారించాలని సూచించారు. విశాఖ నగరానికి ఇప్పటి వరకూ రూ.129.4 కోట్లు కేటాయించారు. ఇందులో గత వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్న సమయంలో విడుదలైన రూ.39.6 కోట్లు ఖర్చు చేసి.. కాలుష్యాన్ని నియంత్రించేందుకు తీవ్రంగా శ్రమించింది. విశాఖలో ఏప్రిల్ 2017 నుంచి మార్చి 2018 వరకూ పీఎం10 స్థాయిలు 159 నమోదు కాగా.. 2019 డిసెంబర్‌కి ఈ సంఖ్య 108కి చేరింది. 2020 జనవరి నుంచి సెప్టెంబర్ వరకూ 96కి తగ్గింది. 2021 నాటికి మరింత కాలుష్యం తగ్గి 90కి చేరుకుంది. కానీ కూటమి ప్రభుత్వంలో మాత్రం కాలుష్యం అమాంతం పెరిగిపోయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిధుల గురించి పట్టించుకోకుండా నగరంపై నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది.
గతేడాది సెప్టెంబర్‌లో మరింత దారుణంగా...
2024–25 దేశవ్యాప్త అధ్యయనం ప్రకారం విశాఖలో వాయు నాణ్యత మరింత క్షీణించింది. ముఖ్యంగా గత ఏడాది సెప్టెంబర్‌లో పీఎం 2.5 సాంద్రత స్థాయిలు దారుణంగా నమోదయ్యాయి. దేశంలోని టాప్–10 అత్యంత కాలుష్య నగరాల రోజువారీ జాబితాలో విశాఖ పదిసార్లు చోటు దక్కించుకోవడం ఆందోళన కలిగిస్తోంది. పోర్టు నుంచి ఎన్టీపీసీ, ఫార్మాసిటీ వరకు అన్నింటి నుంచి కాలుష్యం నగరంలో విస్తరిస్తోంది. వాతావరణంలో కార్బన్ డయాకై ్సడ్ శాతం రోజురోజుకూ పెరుగుతోంది. కూటమి ప్రభుత్వం తక్షణమే కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టకపోతే గాలి నాణ్యత మరింత దిగజారి, ఢిల్లీ లాంటి దుర్భర పరిస్థితులు విశాఖలో కూడా తలెత్తుతాయని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
నగరంలో వాయు కాలుష్యం
(మెక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్‌మీటర్)
నగరంలో పీఎం 10 స్థాయిలు
సంవత్సరం పీఎం10
2018 ఏప్రిల్ 159
2019 డిసెంబర్ 108
2020 సెప్టెంబర్ 96
2021 డిసెంబర్ 90
2024 సెప్టెంబర్ 101