పూడూరు: పరిగి నియోజకవర్గాన్ని మహానగరాన్ని తలపించేలా అన్ని హంగులతో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికై న సొసైటీ పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఈ సంరద్భంగా మాట్లాడుతూ.. రూ.320 కోట్లతో పరిగి ప్రాంతంలో ప్రధాన రహదారులను నిర్మిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా ఆయన రూ.20 కోట్ల వ్యయంతో రంగాపూర్–నిజాంపేట్ మేడిపల్లి వరకు, రూ.50కోట్లతో అంగడిచిట్టంపల్లి–లాల్‌పహాడ్, రూ.9కోట్లతో పూడూరు గేట్– పూడూరు గ్రామం వరకు డబుల్‌రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. రూ.3.5 కోట్లతో మండల కేంద్రంలో నిర్మించిన కస్తూర్బా హాస్టల్, కళాశాల భవనం, ఇందిరమ్మ ఇళ్లను ప్రాంరంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యాభివృద్ధి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. పరిగిలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం కొనసాగుతోందన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేపీ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం రూ.పదివేల కోట్లు మంజూరు చేసిందన్నారు. రూ.35 వేల కోట్లతో ఆరులేన్ల రేడియల్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం భూ సేకరణ చేస్తోందన్నారు. అప్పా జంక్షన్–మన్నేగూడ నాలుగులేన్ల రోడ్డు నిర్మాణ పనులు చివరిదశకు వచ్చాయని చెప్పారు. సొసైటీల ద్వారా వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. ఎస్‌ఐఆర్‌పై ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్‌కుమార్, డీసీసీ ఉపాధ్యక్షుడు ఆనందం, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పట్లోళ్ల రఘునాథ్‌రెడ్డి, వైస్ చైర్మన్ సురేందర్ ముదిరాజ్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు అమీర్, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు కిజర్‌పాషా, సొసైటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి కల్పనకు పరిగిలో ‘ఏటీసీ’
సింగిల్ విండోల ద్వారా వ్యవసాయానికి ఊతం
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి


