● మొదటి విడతలో ఈర్లపల్లి ఎంపిక
● గ్రామంలో కొనసాగుతున్న సర్వే
దౌల్తాబాద్: నిజాం కాలం నాటి భూ రికార్డులు, హద్దుల నేపథ్యంలో కొనసాగుతున్న భూ తగాదాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం భూ రీసర్వేకు శ్రీకారం చుట్టింది. నాడు పట్వారీ, వీఆర్‌ఓలు ఇష్టారాజ్యంగా రికార్డుల్లో పలు మార్పులు చేశారు. తర్వాత వచ్చిన ధరణిలో తప్పులు దొర్లాయి. ఫలితంగా రైతుల మధ్య పంచాయితీలు జరుగుతున్నాయి. వీటికి శాశ్వత పరిష్కారం చూపేందుకు రీసర్వే అనివార్యం అయింది. ఇందులో భాగంగా మండల పరిధి 33 గ్రామాల్లో మొదటి విడతగా ఈర్లపల్లి గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. వారం రోజులుగా లైసెన్స్ సర్వేయర్లు రీసర్వే చేస్తున్నారు.
సాంకేతిక యంత్రంతో..
ఈర్లపల్లిలో భూ రీసర్వేకు అధునాతన రోవర్స్ మిషన్లు వాడుతున్నారు. ఉపగ్రహ చానెళ్ల ద్వారా ఈ యంత్రం పనిచేస్తుంది. రైతుల సాగు భూములతో పాటు, చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు, గుట్టలకు హద్దులు నిర్ధారించనున్నారు. సర్వే వివరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. గ్రామంలో 289 సర్వే నంబర్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రక్రియ వివరాలను రెవెన్యూ అధికారుల ఆమోదం అనంతరం ప్రత్యేకంగా రైతులకు నంబర్లను కేటాయించనున్నారు. కాగా.. ఉన్నతాధికారు ఆదేశాల మేరకు రోవర్ల సహాయంతో ప్రస్తుతం పైలెట్ గ్రామంలోని పొలాల్లో సర్వే చేస్తున్నామని లైసెన్స్‌డ్ సర్వేయర్ రంగరాజు తెలిపారు. సర్వే వలన భూ తగాదాలు సమసిపోతాయని చెప్పారు.


