బషీరాబాద్: సర్ కార్యక్రమంపై బూత్ లెవల్ అధికారులకు శనివారం మండల కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నట్లు తహసీల్దార్ షాహేదా బేగం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శిక్షణ కొనసాగుతుందన్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, ఇంటింటి ధ్రువీకరణ, దరఖాస్తుల స్వీకరణ, నమోదు విధానం, నిబంధనల అమలు తదితర అంశాలపై బీఎల్‌ఓలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
మర్పల్లి: మర్పల్లి ఎంపీడీఓగా శాంత శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. వికారాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించి పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు. ఇప్పటి వరకు ఈఓ పీఆర్‌డీగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ ఇన్‌చార్జ్ ఎంపీడీఓగా వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతన ఎంపీడీఓ శాంత పంచాయతీ కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై ఆరా తీశారు. వంద శాతం నిర్మించుకొనేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం కార్యాలయ సిబ్బంది, జీపీ కార్యదర్శులు, ఉపాధి హామీ పథకం సిబ్బంది ఎంపీడీఓను ఘనంగా సన్మానించారు.
తాండూరు: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సందర్భంగా రేపు(ఆదివారం) తాండూరులోని విలియంమూన్ మైదానంలో యోగా అభ్యాసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు పతంజలి యోగా సమితి అధ్యక్ష కార్యదర్శులు ప్రవీణ్‌కుమార్, లక్ష్మణ్‌లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 5.30 గంటలకు యోగా ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజాబాల్‌రెడ్డి, డివిజన్ స్థాయి అధికారులు హాజరు కానున్నట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
అధ్యక్షుడిగా రఘునందన్ గౌడ్
తాండూరు టౌన్: తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యవర్గాన్ని శుక్రవారం పట్టణంలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా జీ రఘునందన్ గౌడ్ (లైన్ ఇన్‌స్పెక్టర్), వర్కింగ్ ప్రెసిండెంట్‌గా ఎస్ వెంకట్రామ్ రెడ్డి (లైన్‌మెన్), జిల్లా (రీజనల్) కార్యదర్శిగా సీ ఆనంద్ కుమార్ గౌడ్ (ఆర్జీజన్), కోశాధికారిగా భాస్కర్ రెడ్డి (జూనియర్ లైన్‌మెన్) ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా కంపెనీ ప్రెసిడెంట్ ఎం బాలరాజ్ వ్యవహరించారు. తమపై నమ్మకంతో జిల్లా కార్యవర్గ బాధ్యతలు అప్పగించిన పవర్ ఎంప్లాయీస్ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు నూతన అధ్యక్షుడు రఘునందన్ గౌడ్ చెప్పారు. ఈ కార్యక్రమానికి యూనియన్ రాష్ట్ర కార్యదర్శి విజయ్‌కుమార్, ఆచారి, శ్రీనివాస్, చంద్రారావు హాజరయ్యారు.
షాద్‌నగర్: తెలంగాణ రాష్ట్ర ఉత్తమ పౌర పురస్కారానికి షాద్‌నగర్ పట్టణానికి చెందిన యువ కవి, ఉపాధ్యాయుడు రవిప్రకాష్ హర్మాల్ ఎంపికయ్యారు. విద్య, సాహిత్య రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వారికి తెలంగాణ ప్రతిభా వేదిక ఆధ్వర్యంలో పౌర పురస్కారాలను అందజేస్తున్నారు. వచ్చే నెల విజయవాడలో నిర్వహించే కార్యక్రమంలో రవిప్రకాష్ హర్మాల్ పురస్కారాన్ని అందుకోనున్నారు.


