ఆ పంటలు వద్దు
వికారాబాద్: వానాకాలం సీజన్ ప్రారంభమై పక్షం రోజులు దాటినా రైతులు ఆకాశంకేసి చూడాల్సి వస్తోంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పెద్ద వర్షం పడకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మొదట్లో కురిసిన చిన్నపాటి వానలకు 30 శాతం విత్తనాలు వేశారు. ఆ వెంటనే వరుణుడు ముఖం చాటేశాడు. ప్రస్తుత సీజన్‌లో 5.90లక్షల ఎకరాల్లో ఆయా రకాల పంటలు సాగు చేయవచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. చాలా మండలాల్లో అదును కాలేదు. సాగుకు సరిపడా వర్షాలు పడిన తర్వాతే విత్తనాలు వేయాలని అధికారులు సూచిస్తున్నారు. సాధారణంగా రోహిణి లేదా మృగశిర కార్తెలో విత్తు వేస్తారు. కానీ ఇప్పటి వరకు 30 శాతమే వేశారు. మరో వారం గడిస్తే పెసర, మినుము, జొన్న సాగు చేయకపోవడమే మంచిదని వ్యవసాయ శాఖ అఽధికారులు అంటున్నారు. 5.90 లక్షల ఎకరాలకు గాను ఇప్పటి వరకు కేవలం 1.5లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు వేశారు.
లోటు వర్షపాతం
జిల్లాలో 20 మండలాలు ఉండగా ఎనిమిది మండలాల్లో లోటు వర్షపాతం నమోదు కాగా ఆరు మండలాల్లో సాధారణం, ఆరు మండలాల్లో సగటు వర్షపాతానికి మించి పడింది. అయితే కొంతమంది రైతులు ధైర్యం చేసి విత్తనం వేశారు. మని కొందరు వర్షాల కోసం వేచి చూస్తున్నారు. ఇప్పటికే పంటలు వేసిన రైతులు వర్షాలు పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వేసిన విత్తనం మొలకెత్తుతుందా లేకుంటే నష్టపోతామా అని హైరానా పడుతున్నారు. కొన్ని చోట్ల మొలకలు ఎండిపోయాయి.
సింహభాగం పత్తి
ప్రస్తుత సీజన్‌లో రైతులు పత్తి పంట వైపే మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో సాధారణంగా 16 రకాల పంటలు సాగు చేస్తారు. సింహభాగం పత్తి కాగా, ఆ తర్వాత కంది, మొక్కజొన్న, వరి సాగు చేయనున్నారు. గత ఏడాది 2.5లక్షల ఎకరాల్లో పత్తి చేయగా.. ఈ సారి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వరి, కంది సాగు కూడా పెరిగే అవకాశం ఉంది. కోతుల బెడద కారణంగా కూరగాయలు, వేరుశనగ పంటలు వేసేందుకు రైతులు జంకుతున్నారు.
ఖరీఫ్ సీజన్ ప్రారంభమై పక్షం రోజులు దాటినా 30శాతమే విత్తనం
చిరుజల్లులతో సరిపెడుతున్న వరుణుడు
ఈ ఏడాది సాగు అంచనా 5.90లక్షల ఎకరాలు
సాగు చేసింది 1.5లక్షల ఎకరాల్లోనే..
లోటు వర్షపాతం కారణంగా ఇంకా విత్తు పూర్తి కాలేదు. ఈ నెల దాటితే పెసర, మినుము, జొన్న పంటలు వేయకపోవడమే మంచిది. సాగుకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాం. నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాం.
– రాజరత్నం, డీఏఓ


