బషీరాబాద్: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు అందిస్తున్న భోజనంలో గుడ్లు, చికెన్, స్నాక్స్ ఇవ్వడం లేదు. ఈ విషయం శుక్రవారం తహసీల్దార్ షాహేదా బేగం ఆకస్మిక తనిఖీలో వెలుగు చూసింది. మధ్యాహ్న భోజన సమయంలో పాఠశాలను తహసీల్దార్ సందర్శించారు. విద్యార్థినులతో నేరుగా మాట్లాడారు. భోజన నాణ్యత, మెనూ అమలుపై వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు తమకు ప్రారంభం రోజు నుంచి అన్నం, కూర, సాంబార్ మాత్రమే వడ్డిస్తున్నారని, మెనూ అమలు చేయడం లేదని తెలిపారు. గుడ్లు, చికెన్, స్నాక్స్ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తహసీల్దార్ రికార్డులను పరిశీలించి, పాఠశాల నిర్వహణపై ఆరా తీశారు. దీనిపై పాఠశాల స్పెషల్ ఆఫీసర్ సునీత మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి గుడ్లు, చికెన్, స్నాక్స్‌కు సంబంధించి అనుమతులు రాలేదని వివరించారు. అందుబాటులో ఉన్న సరుకులతోనే విద్యార్థినులకు భోజనం అందిస్తున్నామని తెలిపారు. అనుమతులు రాగానే మెనూ అమలు చేస్తామని వివరించారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ.. మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు. సరఫరాలో నెలకొన్న సమస్యలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
అన్నం, కూర, సాంబార్‌తో సరిపెడుతున్న వైనం
చికెన్, స్నాక్స్ ఇవ్వడం లేదన్న విద్యార్థినులు
తహసీల్దార్ తనిఖీలో వెలుగులోకి..


