వదినమ్మా ప్రజల్లోకి వచ్చి తిరగండి | - | Sakshi
Sakshi News home page

వదినమ్మా ప్రజల్లోకి వచ్చి తిరగండి

Jun 20 2026 11:49 AM | Updated on Jun 20 2026 11:49 AM

వదినమ్మా ప్రజల్లోకి వచ్చి తిరగండి

ఇబ్రహీంపట్నం: ప్రభుత్వ పథకాలు అందడంలేదని పదేపదే మాట్లాడుతున్న మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి ప్రజల్లోకి వచ్చి తిరిగితే తమ ప్రభుత్వ పథకాలు ఏమిటో, అవి ఎలా అందుతున్నాయో తెలుస్తాయని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘మా వదిన సబితమ్మ ఇంటికి మీ తమ్ముడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆడబిడ్డలకు అందించే చీర సారె పంపుతాను.. ఇందిరమ్మ చీర ధరించి బస్సెక్కండి.. ఆధార్‌ కార్డు చూపిస్తే ఒక్క రూపాయి ఎవరూ అడగరు.. ఒకవేళ రేషన్‌కార్డు ఉంటే బస్సు దిగగానే రేషన్‌ దుకాణానికి వెళ్లి సన్న బియ్యం తీసుకోండి.. అదే మార్గంలో మహిళా సంఘాలను కలిసి అవసరమైతే ఆ సంఘంలో చేరండి.. ఇందిరమ్మ మహిళా పథకం కింద ఒక్కో సంఘానికి పది లక్షలు అందించే వడ్డీలేని రుణాన్ని ఉపయోగించుకోండి.. మీకు సంబంధించిన వారెవరైనా బిడ్డ పెళ్లి చేస్తే కల్యాణలక్ష్మి కింద అందిస్తున్న రూ.లక్షా 116 చెక్కు ఇప్పించండి.. ఇంటికి చేరాక గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు అందించే విద్యుత్‌తో ఫ్యాన్‌, టీవీ ఆన్‌చేసి కాసేపు విశ్రాంతి తీసుకోండి.. వంటగదికి వెళ్తే మహాలక్ష్మి పథకం కింద రూ.500 అందిస్తున్న ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ను ఉపయోగించుకొని మీకు ఇష్టమైన వంటలు వండుకోవచ్చు’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. స్వయంగా వెళ్లి పరిశీలిస్తే ప్రభుత్వ పథకాల అమలు విషయంలో స్పష్టత వస్తుందన్నారు. మీరు ఏవైనా సలహాలిస్తే సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తాను.. ధన్యవాదాలు వదినమ్మా అంటూ ముగించారు.

మా పథకాలేంటో తెలుస్తాయి

ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డికి వ్యంగ్యాస్త్రాలతో కూడిన ప్రకటన విడుదల

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement