హెచ్‌పీవీ టీకా.. బాలికకు రక్ష | - | Sakshi
Sakshi News home page

హెచ్‌పీవీ టీకా.. బాలికకు రక్ష

Jun 20 2026 11:49 AM | Updated on Jun 20 2026 11:49 AM

హెచ్‌పీవీ టీకా.. బాలికకు రక్ష ఐసెట్‌లో సత్తా చాటిన సాహితి శంకరప్పకు ఏఎంసీ పగ్గాలు? నీటిగుంతలో పడి వృద్ధురాలి మృతి ఈదురు గాలులకు కూలిన చెట్టు

యాలాల: బాలికలు సర్వైకల్‌ క్యాన్సర్‌ వ్యాధి బారిన పడకుండా ఇచ్చే హెచ్‌పీవీ టీకా ఎంతో సురక్షితమని పీహెచ్‌సీ వైద్యురాలు డాక్టర్‌ రుబియా నాజ్‌ అన్నారు. శుక్రవారం 11 మంది విద్యార్థినులకు టీకా వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మండల పరిధిలో ఇప్పటి వరకు 14 ఏళ్లు నిండిన 204 మందికి టీకా వేశామని చెప్పారు. ఈ వ్యాక్సిన్‌తో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవన్నారు. అపోహలు వీడి బాలికలకు టీకా వేయించాలని సూచించారు. ఏఎన్‌ఎంలు జగదీశ్వరి, లక్ష్మీ తదితరులు ఉన్నారు.

అనంతగిరి: వికారాబాద్‌ పట్టణానికి చెందిన డి.సాహితి తెలంగాణ ఐసెట్‌ ఫలితాల్లో ఉత్తమంగా రాణించింది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో రాష్ట్ర స్థాయి 250వ ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థినిని తల్లిదండ్రులు, అధ్యాపకులు తదితరులు అభినందించారు. సాహితి.. పట్టణంలోని డిగ్రీ కళాశాలలో బీఎస్సీ(ఎంపీసీఎస్‌)పూర్తి చేసి, ఎంట్రన్స్‌ రాసింది.

బషీరాబాద్‌: మండల పరిధి అల్లాపూర్‌ గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు శంకరప్పకు నామినేటెడ్‌ పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంత కాలంగా పదవులు దక్కడం లేదని అంతర్గత సమావేశాల్లో ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. ఈ క్రమంలో బషీరాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ(ఏఎంసీ) చైర్మన్‌ పదవి ఎస్సీకి రిజర్వ్‌ కావడం, ఈ బాధ్యతలను శంకరప్పకు అప్పగించేందుకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌ రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితం అల్లాపూర్‌లో శంకరప్ప నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే.. చైర్మన్‌ పదవిపై సానుకూల హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ అంశంపై ఇప్పటికే ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఏఎంసీ కమిటీ పదవీకాలం జూలై 2తో ముగియనుండటంతో కొత్త కమిటీ ఏర్పాటుపై కసరత్తు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో సీనియర్‌ నాయకుడైన శంకరప్ప పేరే ప్రధానంగా వినిపిస్తుండగా, ఈ నెలాఖరుకు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

తాండూరు రూరల్‌: ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ సంఘటన శుక్రవారం కరన్‌కోట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి కరన్‌కోట్‌ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాథోడ్‌ వినోద్‌ కథనం ప్రకారం.. గుర్తు తెలియని వృద్ధురాలు(60), గ్రామ శివారులోని సీసీఐ ఫ్యాక్టరి సమీపంలోని ఓ నీటి గుంతలో పడి దుర్మరణం చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

బంట్వారం: కోట్‌పల్లి మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం వీచిన ఈదురు గాలులకు వేప చెట్టు కూలి ఉప్పరి నాగమణి ఇంటిపై పడింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలో పై కప్పు ధ్వంసం అయిందని, సరుకులు తడిసిపోయాయని బాధిత కుటుంబీకులు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement