● వసతి గృహ విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలి
● కలెక్టర్ దీపక్ తివారి
తాండూరు: పట్టణ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. గురువారం తాండూరులోని గిరిజన సంక్షేమ బాలికల కళాశాల, వసతి గృహాలను సందర్శించారు. విద్యార్థులకు పుస్తకాల పంపిణీపై ఆరా తీశారు. వంట గదిని తనిఖీ చేశారు. కాలం చెల్లిన సరుకులు వాడొద్దని సూచించారు. అనంతరం శాంతినగర్ పార్కును పరిశీలించారు. ప్రజలకు ఉపయోగ పడే పరికరాలు సమకూర్చాలని మున్సిపల్ కమిషనర్ రాకేష్‌రెడ్డికి సూచించారు. మిషన్ భగీరథ మంచి నీటి ట్యాంకుల నిర్మాణ పనులను పరిశీలించారు. సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అంతారం శివారులోని డంపింగ్ యార్డును పరిశీలించి.. నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. అనంతరం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పరిశీలించి పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని హౌసింగ్ డీఈఈ ఖలీమొద్దీన్‌కు సూచించారు. కార్యక్రమంలో ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.


