వసతిగృహం.. భవితకు మార్గం | - | Sakshi
Sakshi News home page

వసతిగృహం.. భవితకు మార్గం

Jun 19 2026 7:45 AM | Updated on Jun 19 2026 7:45 AM

కుల్కచర్ల: వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం విశేష ప్రాధాన్యత కల్పిస్తోంది. ముఖ్యంగా విద్యా రంగంలో.. అనేక అవకాశాలు కల్పిస్తోంది. మారుమూల ప్రాంతాల్లో సంక్షేమ వసతిగృహాలను ఏర్పాటు చేయడమే కాకుండా.. సకల సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నతంగా రాణించేలా ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగా చౌడాపూర్‌ మండలం మరికల్‌ గ్రామంలో షెడ్యూల్‌ కులాల శాఖ పరిధిలో బాలుర వసతిగృహం ఏర్పాటు చేసింది. గడిచిన విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వందశాతం ఫలితాలను రాబట్టింది.

నిబంధన లేదు

పిల్లలను ప్రోత్సహించేందుకు ఎలాంటి నిబంధనలు లేకుండా చదువుకునే వారికి వసతిని కల్పిస్తోంది. ప్రవేటు పాఠశాలలో చదువుతున్నప్పటికీ.. మరికల్‌ ఎస్సీ వసతిగృహంలో ప్రవేశం పొందవచ్చు. తొలి ప్రాధాన్యత జిల్లా వాసులకు కల్పించింది. మిగతా వారు రాష్ట్రంలోని ఎక్కడి ప్రాంతం వారైనా అవకాశం ఇస్తోంది. షెడ్యూల్‌ కులాలకే ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ.. ఒకే సామాజికవర్గం అంటూ నిబంధన లేదు.

నెలనెలా రూ.200లు

మరికల్‌ ప్రభుత్వ బాలుర హాస్టల్‌లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుతోంది. బోధన అంశంలో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. మౌలిక సౌకర్యాల కోసం చిన్నారులకు ప్రతి ఒక్కరికీ నెలనెలా రూ.200లు అందజేస్తోంది. హాస్టల్‌లో ప్రవేశానికి ఆధార్‌కార్డు, కులం, నివాసం, ఆదాయం ధృవీకరణ పత్రాలు వెంట తెచ్చుకోవాలి. మరిన్ని వివరాలకు వసతిగృహ ప్రత్యేకాధికారి నరేందర్‌ రెడ్డి 8886046672 నంబరును సంప్రదించవచ్చు.

నాణ్యమైన బోధన, మెరుగైన సౌకర్యాలు

ప్రత్యేక తరగతులు, నిరంతరం పర్యవేక్షణ

పదిలో వందశాతం ఫలితాలు

హాస్టల్‌ సొంతం

ప్రవేశ పరీక్ష లేకుండానే ప్రవేశం

విద్యార్హత పత్రాలు చాలు

వసతిగృహంలో చేరేందుకు ఎలాంటి ప్రవేశ పరీక్ష లేదు. ఇప్పటి వరకు చదువుకున్న విద్యార్హత పత్రాలతో ప్రవేశం పొందవచ్చు. నోట్‌బుక్స్‌, మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నాం. ప్రత్యేక తరగతులు చెబుతూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాం. నిరంతరం పర్యవేక్షిస్తున్నాం.

– నరేందర్‌ రెడ్డి, మరికల్‌ బాలుర వసతిగృహం ప్రత్యేకాధికారి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement