ఆస్తి గొడవలే కారణం
తాండూరు: ఆస్తి గొడవల కారణంగా ఓ వ్యక్తి తన చిన్నమ్మపై రోకలిబండతో దాడి చేసిన ఘటన తాండూరులో బుధవారం చోటుచేసుకుంది. పట్టణ సీఐ పరమేశ్వర్‌గౌడ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మల్‌రెడ్డిపల్లికి చెందిన మిట్టి వెంకటయ్య, మిట్టి పాండు అన్నాదమ్ములు. ఓ ఇంటి విషయంలో వీరి కుటుంబాల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పాండు భార్య అరుణ సదరు ఇంటికి తాళం వేసింది. దీనిపై ఆవేశానికి లోనైన వెంకటయ్య కుమారుడు ప్రవీణ్ చిన్నమ్మతో గొడవకు దిగాడు. ఈక్రమంలో పక్కనే ఉన్న రోకలిబండతో అరుణపై దాడికి పాల్పడ్డాడు. తల, కాళ్లు, చేతులపై తీవ్ర గాయాలైన ఆమెను స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించగా, మెరుగైన వైద్యుం కోసం హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. పాండు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.


