సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవీంద్రాచారి
మీర్‌పేట: ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలన్నింటిని తక్షణమే అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందోజు రవీంద్రాచారి డిమాండ్ చేశారు. ఆదివారం లెనిన్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో బాలాపూర్ మండలంలోని ‘సమస్యలు–పరిష్కారం’ పై నాయకులతో రవీంద్రాచారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో గత 15 ఏళ్ల క్రితం వేసిన డ్రైనేజీ పైపులు ప్రస్తుతం పెరిగిన జనాభాతో సామర్థ్యం సరిపోక తరచూ ఉప్పొంగుతున్నాయన్నారు. మహిళలకు ఇస్తామన్న రూ.2,500, దివ్యాంగులకు పెంచుతామన్న చేయూత పెన్షన్‌లు, ఒంటరి మహిళలకు జీవనోపాధి కల్పిస్తామని రెండున్నరేళ్లు పూర్తయినా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. హైదరాబాద్ నగరంలో పేద ప్రజలకు సుమారు 80వేల గుడిసెలు వేయించిన ఘనత సీపీఐ పార్టీదని గుర్తుచేశారు. సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు లక్ష్మారెడ్డి, పిచ్చిరాజు, గిరిజన సమాఖ్య నాయకులు రెడ్యానాయక్, ఛత్రునాయక్, శ్రీనునాయక్, రమేష్, హుస్సేన్, విజయ్‌కుమార్, లక్ష్మి, యాదమ్మ పాల్గొన్నారు.


