మర్పల్లి: శిథిలావస్థకు చేరిన హోటల్ స్లాబ్ కుప్పకూలడంతో నలుగురు క్షతగాత్రులయ్యారు. ఈ ఘటన శనివారం మర్పల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రవూఫ్, స్థానికులు తెలిపిన ప్రకారం.. ఎస్సీ కార్పొరేషన్ నిధులతో 35 ఏళ్ల క్రితం మండల కేంద్రంలో ఓ వ్యాపార సముదాయం నిర్మించారు. ఈ భవనంలో ఇమ్రాన్ అనే యువకుడు ఆరు నెలలుగా కేహెచ్‌ఎన్ హోటల్(టిఫిన్ సెంటర్) నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఉదయం 11.15గంటల సమయంలో భవనం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. అప్పటికే అక్కడ టిఫిన్ చేస్తున్న నలుగురు శిథిలాల కిందే చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు, సర్పంచ్ రమేశ్ హిటాచీ, జేసీబీ రప్పించి శిథిలాలు తొలగించి గ్రామానికి చెందిన నాజర్, రమేష్, చందన, కొత్లాపూర్‌కు చెందిన శివకుమార్‌ను బైటకు తీసుకువచ్చారు. వారికి మర్పల్లి కమ్యూనిటీ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసి మెరుగైనవైద్యం కోసం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో నాజర్ కుడికాలు, శివకుమార్ రెండుకాళ్లు విరిగాయి. రమేశ్ తలకు బలమైన గాయాలయ్యాయి. చందనకు స్వల్పగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న వికారాబాద్ డీఎస్‌పీ అంజయ్య మోమిన్‌పేట్ సీఐతో ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుల వివరాలు సేకరించారు. తహసీల్దార్ పురుషోత్తం క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు.
మెరుగైన వైద్యం అందిస్తాం: స్పీకర్
సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. క్షతగాత్రుల కుటుంబ సభ్యులు అధైర్య పడొద్దని తాను అండగా ఉంటానని చెప్పారు. ఆయన వెంట ఏఎంసీ చైర్మన్ మహేందర్ రెడ్డి, సహకార సంఘం చైర్మన్ ప్రవీణ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
మర్పల్లిలో నలుగురికి గాయాలు
జేసీబీ, ఇటాచీ సాయంతో క్షతగాత్రులను బయటకు తీసుకువచ్చిన పోలీసులు
ఘటనా స్థలంలో వివరాలు సేకరించిన డీఎస్‌పీ అంజయ్య
క్షతగాత్రులను పరామర్శించిన స్పీకర్ ప్రసాద్‌కుమార్


