● ఇస్టానుసారంగా మాట్లాడితే ఊరుకోం
● కాంగ్రెస్ నాయకులు
దుద్యాల్: అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరెందర్ రెడ్డి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇస్టానుసారంగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ దుద్యాల్ మండల అధ్యక్షుడు ఆవుటి శేఖర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే ఇలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. కొడంగల్ నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణాలు, లక్ష ఎకరాలకు సాగు నీరు, తాగునీరు, ఎడ్యుకేషన్ హబ్, పరిశ్రమల ఏర్పాటు, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. సకల జనుల ప్రయోజనాలు కోరుకుంటున్న రేవంత్‌పై.. పట్నం నోటికి వచ్చినట్లు మాట్లాడడం తగదన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల హయాంలో నియోజకవర్గ అభివృద్ధికి ప్రస్తుత నిధులతో పోలిస్తే 10 శాతం కూడ ఇవ్వలేదని ఆరోపించారు. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా మోసం చేసిందని విమర్శించారు. ప్రజలు అన్నీ గ్రహిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. కనీసం డిపాజిట్ దక్కించుకునే యత్నం చేయాలని నరెందర్ రెడ్డికి సవాల్ విసిరారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మంగలి రాములు, రేవంత్ సైన్యం రాష్ట్ర అధ్యక్షుడు బ్యాగరి నర్సింహ, కాంగ్రెస్ నాయకుడు నరెందర్ గౌడ్‌లు పాల్గొన్నారు.


