శిక్షణ, ఉపాధిని వినియోగించుకోండి | - | Sakshi
Sakshi News home page

శిక్షణ, ఉపాధిని వినియోగించుకోండి

Jun 5 2026 10:15 AM | Updated on Jun 5 2026 10:15 AM

కుల్కచర్ల: నిరుద్యోగ గిరిజన యువతకు ప్రభుత్వం ఇచ్చే శిక్షణ, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కమలాకర్‌ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో యువతకు వివిధ సంస్థల ఆధ్వర్యంలో ఇచ్చే శిక్షణ, ఉద్యోగాల గురించి అవగాహన కల్పించారు. ఎంపీడీఓ రామకృష్ణ, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్‌ నాయక్‌, గిరిజన వసతిగృహ ప్రత్యేకాధికారులు, యువకులు పాల్గొన్నారు.

‘సర్‌’పై ప్రత్యేక దృష్టి

తాండూరు: ఓటరు జాబితా ముమ్మర సవరణ(సర్‌) కార్యక్రమం ముగిసే వరకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, బీఎల్‌ఏలు ప్రత్యేక దృష్టి సారించాలని ఆ పార్టీ తాండూరు నియోజకవర్గ సర్‌ కమిటీ కన్వీనర్‌ కరణం పురుషోత్తంరావు అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లడారు. ఓటరు జాబితా సవరణలో అర్హులైన ఓటర్లు, పార్టీ మద్దతు దారుల ఓట్లకు సంబంధించి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా పట్టణంలోని తులసీ గార్డెన్‌లో ఈ నెల 7న ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అధ్యక్షతన 269 మంది బీఎల్‌ఏలతో సమావేశం జరగనుందని పేర్కొన్నారు. సవరణలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా.. పార్టీ నేతల దృష్టికి తేవాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పట్లోళ్ల నర్సింహులు, పార్టీ నాయకులు, ఆత్మ కమిటీ చైర్మన్లు ఉన్నారు.

ఉద్యమ జర్నలిస్టులను

గుర్తించండి

జర్నలిస్ట్‌ ఫోరం జిల్లా

సహాయ కార్యదర్శి వెంకన్న

అబ్దుల్లాపూర్‌మెట్‌: తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులను ప్రభు త్వం గుర్తించాలని తెలంగాణ జర్నలిస్ట్‌ ఫోరం(టీజేఎఫ్‌) రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి పల్లె వెంకన్న కోరారు. గురువారం అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2009–2014 జూన్‌ 2 వరకు ఎల్‌బీనగర్‌లో తెలంగాణ జర్నలిస్ట్‌ ఫోరం ఆధ్వర్యంలో సమష్టి పోరాటలు చేశామన్నారు. ఓ పక్కన జేఏసీ కింద ఉద్యోగులు, న్యాయవాదులు, ఆర్టీసీ, ప్రజాసంఘలతో కలిసి పెద్ద ఎత్తున తెలంగాణ పోరు సాగించామన్నారు. రాష్ట్రం వచ్చే వరకు జరిగిన పోరాటాల్లో జర్నలిస్టులు కీలక భూమిక పోషించారన్నారు. ప్రస్తుతం సర్కారు అర్హులైన ఉద్యమ జర్నలిస్టులకు గుర్తింపు కార్డులు, హెల్త్‌ కార్డు లు జారీ చేయాలని కోరారు. ఫ్యూచర్‌ సిటీలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. త్వరలో ఉద్యమ జర్నలిస్టులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.

లారీని ఢీ కొన్న బైక్‌

ఒకరి మృతి, మరొకరికి గాయాలు

షాద్‌నగర్‌రూరల్‌: ఆగి ఉన్న లారీని బైక్‌ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని లింగారెడ్డిగూడ గ్రామ శివారులో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నందిగామ మండలం అప్పారెడ్డిగూడ గ్రామానికి చెందిన కార్తీక్‌(19), స్నేహితుడు శ్రీనాథ్‌ను షాద్‌నగర్‌లో వదిలిపెట్టేందుకు బైక్‌పై వెళుతున్నారు. లింగారెడ్డిగూడ శివారులో రోడ్డుపై నిలిచిన లారీని గమనించకుండా వెనుక నుంచి ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో బైక్‌ నడుపుతున్న కార్తీక్‌ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా.. శ్రీనాథ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ సుశీల తెలిపారు

Advertisement
 
Advertisement
Advertisement