● ఆందోళన కలిగిస్తున్న
డీఏపీ ఎరువు
● సరిపడా నిల్వలు లేక
రైతుల ఆందోళన
మోమిన్‌పేట: వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే రైతులకు డీఏపీ ఎరువు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. నాలుగైదు రోజుల్లో పొలం పనుల్లో నిమగ్నమయ్యే అన్నదాతలకు డీఏపీ ఎరువు సమస్య ఆందోళన కలిగిస్తుంది. డీఏపీని దుక్కిలో వేసుకొని దున్నుకోవాల్సి ఉన్నందున ఫర్టిలైజర్ షాపుల్లో లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువుల ధరలు అమాంతం పెరగడం, కేవలం డీఏపీ ఎరువు మాత్రమే పెరగక పోవడంతో కర్షకులు ఈ ఎరువుపై ఆసక్తి చూపుతున్నారు. సదాశివపేట, వికారాబాద్ తదితర పెద్ద పట్టణాలలో మాత్రమే డీఏపీ దొరుకుతుందని, మండల స్థాయిలో అందుబాటులో లేదని రైతులు పేర్కొంటున్నారు. అది కూడా ఎక్కువ ధరకు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దబాయిస్తున్న వ్యాపారులు
బస్తాకు రూ.250 ఎక్కువ తీసుకుంటున్నారని, బిల్లు మాత్రం రూ.1,350 రాసి ఇస్తున్నారని ఇదేమని అడిగితే పై నుంచి ఇవ్వడం లేదని, మేము కూడా ఎక్కువ ధరకే తెస్తున్నామని వ్యాపారస్తులు దబాయిస్తున్నట్లు కర్షకులు చెబుతున్నారు. దిక్కులేక తప్పని పరిస్థితిలో రవాణా ఖర్చులను అదనంగా భరిస్తూ తీసుకు వస్తున్నారు. మోమిన్‌పేటలో అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయని త్వరలో డీఏపీ ఎరువులను తెప్పిస్తామని ఏఓ రామకృష్ణారెడ్డి తెలిపారు.


