పరిగి: నియోజకవర్గంలో దళిత, గిరిజనులపై రోజురోజుకూ దాడులు పెరుగుతున్నాయని. దీన్ని సహించేది లేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య అన్నారు. పలువురు బాధితులతో కలిసి సోమవారం పరిగిలో ప్రజాసంఘాలు, విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత, గిరిజనుల భూములపై కన్నేసిన కొంత మంది అధికార పార్టీ నాయకులు అన్యాయంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పూడూరు మండలం అంగడిచిట్టంపల్లి సర్వేనంబర్ 100లో భూమిని కొనుగోలు చేసిన అంగోత్ గణేశ్, విజయరాజు వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. గ్రామానికి చెందిన కొందరు ఈ పొలంలోకి ప్రవేశించి, కులం పేరుతో దూషిస్తూ షెడ్డుతో పాటు వ్యవసాయ పనిముట్లను ధ్వంసం చేశారన్నారు. ఈ విషయమై బాధితులు చన్గోముల్ పీఎస్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు బాధితులపై బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. ఈవిషయమై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినా, దర్యాప్తు చేయడం లేదని ఆరోపించారు. రాజకీయ నేతలకు వత్తాసు పలుకుతూ సదరు భూములను అమ్మేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న నియోజకవర్గ నాయకుడు ఒకరు ఈ విషయంలో తలదూర్చి బాధితులపై పోలీసులతో ఒత్తిడి చేయిస్తున్నాడని మండిపడ్డారు. పూడూరు గ్రామానికి చెందిన రమేశ్‌ను కుల వివక్షకు గురిచేసినా, ఇప్పటికీ కేసు నమోదు చేయలేదన్నారు. అలాగే పరిగిలోని సర్వే నంబర్ 214లో నర్సింహులు అనే వ్యక్తి కొనుగోలు చేసిన భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇలా అనేక ఘటనల్లోనూ బాధితులనే నేరస్తులుగా చూస్తున్నారని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు. ఈ మేరకు డీఎస్పీ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. సరైన స్పందన రాకపోతే ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాాధికారి చంద్రయ్య, నాయకులు సత్తయ్య, రమేశ్, గణేశ్, విజయరాజు, సాయిబన్న, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
చిట్టెంపల్లి భూ వివాదంలో అధికార పార్టీ నేత జోక్యం తగదు
అట్రాసిటీ కేసులను నిర్వీర్యం చేస్తున్న పోలీసులు
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య


