పంచాయతీ రాజ్ ఏఈ నందిని
తాండూరు రూరల్: చదువుతోనే బంగారు భవిష్యత్ ఉంటుందని పంచాయతీ రాజ్ ఏఈ నందిని అన్నారు. గురువారం మండలంలోని జినుగుర్తి మోడల్ స్కూల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందన్నారు. ఉచితంగా పాఠ్య, నోటు పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫాం అందజేస్తారని పేర్కొన్నారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో బోధన చేస్తారని తెలిపారు. తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ స్కూళ్లల్లోనే చేర్పించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
తల్లి ఆరోగ్యం బిడ్డకు రక్ష
డీడబ్ల్యూఓ కృష్ణవేణి
బంట్వారం: గర్భిణి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే పుట్టబోయే బిడ్డకు రక్ష అని డీడబ్ల్యూఓ కృష్ణవేణి అన్నారు. గురువారం మండలకేంద్రంలోని రైతు వేదికలో ఐసీడీఎస్ మర్పల్లి ప్రాజెక్టు ఆధ్వర్యంలో పోషణ పక్వాడ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భిణులు క్రమం తప్పకుండా పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. భోజనంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, గుడ్లు, పాలు, మాంసకృతులు ఉండేలా చూసుకోవాలన్నారు. అనంతరం చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో మహిళా సాధికారిత కేంద్రం బృందం సభ్యులు వరలక్ష్మి, బాబు, రామదాసు, ఇంచార్జి సీడీపీఓ రిజ్వానా బేగం, ఎంఈఓ విక్రమ్‌రెడ్డి, సీహెచ్‌ఓ విజయ్‌కుమార్, సూపర్‌వైజర్లు వైస్ణవి, బ్లెస్సీ అంగన్‌వాడీ టీచర్లు, గర్భిణులు పాల్గొన్నారు.
రాష్ట్ర జట్టులో
చైత్రారెడ్డికి స్థానం
తాండూరు టౌన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్ –17 బాలికల విభాగం రాష్ట్ర స్థాయి క్రికెట్ జట్టుకు చైత్రారెడ్డి ఎంపికయ్యారు. పెద్దేముల్ మండలం గిర్మాపూర్ గ్రామానికిచెందిన రాంరెడ్డి, స్వాతి దంపతుల కుమార్తె చైత్రారెడ్డి. పట్టణంలోని మల్‌రెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెలక్షన్స్‌లో చైత్రారెడ్డి రాష్ట్ర జట్టుకు ఆల్‌రౌండర్‌గా ఎంపికయ్యారు. ఈనెల 29న హర్యానాలో జరగనున్న జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో ఆమె పాల్గొననున్నారు. చైత్రారెడ్డిని స్పాన్సర్ లొంక నర్సింలు, లెజెండ్ క్రికెట్ అకాడమీ కోచ్‌లు సాహిల్, సోహైల్ తదితరులుఅభినందించారు. రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపిక కావడం పట్ల గిర్మాపూర్ వాసులు సంతోషం వ్యక్తం చేశారు.
ఘన నివాళి
అనంతగిరి: భగీరథుడు మహా జ్ఞాని అని పరోపకారానికి ఆయన పెట్టింది పేరని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజశ్రీ భగీరథ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భగీరథుడు ఎంత కష్టమైనా లెక్కచేయకుండా అనుకున్నది సాధించే వ్యక్తిత్వం కల మహావ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, డీపీఓ జయసుధ, డీడబ్ల్యూఓ కృష్ణవేణి, డీపీఆర్‌ఓ చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.


