న్యాయ పోరాటం చేస్తాం
దోమ: పరిగి, దోమ మండలాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన ఇండస్ట్రియల్ పార్క్‌కు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. భూ సేకరణ నోటిఫికేషన్ వచ్చింది మొదలు బాధిత రైతులు ఆందోళన బాట పట్టారు. వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మూడు తరాలుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భూములను లాక్కుంటే రోడ్డున పడతామని దోమ మండలం బట్లచందారం, కొండాయపల్లి, అనంతరెడ్డిపల్లి గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పది రోజులుగా బట్లచందారం గ్రామంలో ఆయా గ్రామాల రైతులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
2,145 ఎకరాల సేకరణకు..
ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం పరిగి, దోమ మండలాల్లో 2,145 ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పరిగి మండలం కాండ్లాపూర్, రాపోల్ గ్రామాల్లో 260 ఎకరాల పట్టా భూములు, 937 ఎకరాల లావాణి పట్టా భూములు తీసుకునేందుకు చర్యలు చేపట్టింది. దోమ మండలంలోని బట్లచందారం గ్రామంలో 235 ఎకరాల పట్టా భూములు, 12 ఎకరాల లావాణి పట్టా భూములు తీసుకునేందుకు చర్యలు చేపట్టింది. కొండాయపల్లిలో 371 ఎకరాల పట్టా, 25 ఎకరాల లావాణి పట్టా, అనంతరెడ్డిపల్లిలో 209 ఎకరాల పట్టా, 96 ఎకరాల లావాణి పట్టా భూములు సేకరించేందుకు సిద్ధమైంది. దీంతో ఆయా గ్రామాల రైతులు రోడ్డెక్కారు. తరతరాలుగా భూములు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని పరిశ్రమల పేరిట పంట పొలాలను తీసుకుంటే అన్యాయం అవుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు మాత్రం ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు.
బీఆర్‌ఎస్, సీపీఎం మద్దతు
భూములు కోల్పోతున్న రైతులకు బీఆర్‌ఎస్, సీపీఎం నేతలు మద్దతు ప్రకటిస్తున్నారు. ఇటీవల బట్లచందారం గ్రామంలో రైతుల దీక్షకు పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి మద్దతు తెలిపారు. బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. న్యాయ పోరాటం చేస్తామని పేర్కొన్నారు. సీపీఎం నేతలు సైతం సోమవారం తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. రైతుల భూములను లాక్కోవద్దని ప్రభుత్వానికి సూచించారు. భూసేకరణ నోటిఫికేషన్‌ను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులకు అండగా ఉద్యమాలు, న్యాయ పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
పరిశ్రమల పేరుతో సాగు భూములు లాక్కోవడం సరికాదు. ఉన్న ఆరు ఎకరాలు తీసుకుంటే రోడ్డున పడతాం. భూమి లేకపోతే వలస పోవడం తప్ప మరో మార్గం లేదు. ప్రభుత్వం వెంటనే భూ సేకరణను నిలిపివేయాలి. లేకుంటే చావే శరణ్యం.
– బైకని వెంకటయ్య, బట్లచందారం
నా పేరిట ఐదెకరాల భూమి ఉంది. అందులో పంటలు పండించుకొని జీవనం సాగిస్తున్నాం. ప్రభుత్వ చర్యలతో ఉపాధి కోల్పోతాం. భూ సేకరణ నోటిఫికేషన్‌ను వెంటనే నిలిపివేయాలి. లేకుంటే మా పరిస్థితి దయనీయంగా మారుతుంది.
– వార్ల రాంచంద్రయ్య, బట్లచందారం
భూములు కోల్పోతున్న రైతులకు అండగా ఉంటాం. నోటిఫికేషన్‌ను రద్దు చేసే వరకు అన్నదాతలతో కలిసి పోరాటం చేస్తాం. పంట పొలాల్లో ఇండస్ట్రియల్ పార్క్‌ల ఏర్పాటు సరికాదు. బలవంతంగా భూములు లాక్కుంటే చూస్తూ ఉరుకోం.
– మల్లేశం, మాజీ వైస్ ఎంపీపీ, దోమ
పొలాలు ఇచ్చే ప్రసక్తే లేదంటున్న రైతులు
పది రోజులుగా పోరుబాట
పరిగి, దోమ మండలాల్లో 2,145 ఎకరాల సేకరణకు రంగం సిద్ధం
అన్నదాతలకు అండగా ప్రతిపక్షాలు
ఇండస్ట్రియల్ పార్క్ పేరిట రైతుల భూములు లాక్కోవాలని చూస్తే న్యాయ పోరాటం చేస్తాం. భూమి కోల్పోతున్న ప్రతి రైతు కుటుంబానికి బీఆర్‌ఎస్ అండగా ఉంటుంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. నోటిఫికేషన్ రద్దు చేయాల్సిందే.
– కొప్పుల మహేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పరిగి


