తాండూరు రూరల్: విద్యుదాఘాతంతో ఇళ్లు కాలిపోయింది. ఈ సంఘటన మండల పరిధి మల్కాపూర్‌లో చోటుచేసుకుంది. బాధితుడి, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెంది న బడ్‌గిరి రాజు నాపరాతి గనుల్లో కార్మికుడిగా పని చేసున్నాడు. భార్య, పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంట్లోని ఫ్రిజ్‌ను ఆన్ చేయగా.. మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే తాండూరు ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వగా.. వారు మంటలను ఆర్పేశారు. ఇంట్లోని సామగ్రి కాలి బుడిదయింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
గల్లంతైన వ్యక్తి
మృతదేహం లభ్యం
బంట్వారం: స్నానానికి వెళ్లి చెరువులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. కోట్‌పల్లి ఎస్‌ఐ శైలజ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఇందోల్‌కు చెందిన తలారి వెంకటయ్య(50) మంగళవారం చెరువులో ఈత కొడుతూ బురదలో చిక్కుకుని నీట మునిగాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. బుధవారం ఉదయం నీటిలో మృతదేహం పైకి తేలింది. శవాన్ని వెలికితీసి, పోస్టుమార్టం అనంతరం కుటంబ సభ్యులకు అప్పగించామని ఎస్‌ఐ తెలిపారు.
మందుగుండు పేలి
ఆవుకు తీవ్రగాయాలు
ఇబ్రహీంపట్నం: అడవి పందుల షికారుకు పెట్టిన మందుగుండు సామగ్రి పేలి మేతకెళ్లిన ఆవుకు తీవ్రగాయాలైన సంఘటన శేరిగూడలో చోటుచేసుకుంది. శ్రీనివాస్‌రెడ్డి అనే రైతుకు నాలుగు ఆవులున్నాయి. సమీప అటవీ ప్రదేశంలో మేత కెళ్లిన ఆవుల్లో ఒకటి మందుగుండు సామగ్రిని నోటపట్టుకోవడంతో పేలి నోటికి మెడకు తీవ్రగాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. సుమారు రూ.60 వేల విలువచేసే ఆవు ప్రాణాపాయస్థితిలో ఉండటంలో మా సరస్వతి వెటర్నరీ హాస్పిటల్ చారిటబుల్ సొసైటీకి ఆ రైతు అప్పగించారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్, ఫారెస్టు ఽఅధికారులకు ఫిర్యాదు చేశారు.
శంషాబాద్: నకిలీపాస్‌పోర్టు, నకిలీ విద్యార్హతల సర్టిఫికెట్ కేసులో చార్జిషీట్ సమర్పించేందుకు ఆర్‌జీఐఏ పోలీసు ఔట్‌పోస్టు సీఐ కనకయ్య, ఎస్‌ఐ సిద్ధేశ్వర్ రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన సంగతి విదితమే. బుధవారం వీరిని నాంపల్లి ఏసీబీ కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు. వీరికి జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు ఏసీబీ వెల్లడించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీఐ కనకయ్య ఇంట్లో జరిపిన సోదాల్లో రూ.33.97 లక్షల నగదుతో పాటు కొన్ని ఆస్తులకు సంబంధించిన దస్తావేజులను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.


