పహాడీషరీఫ్: తల్లీకూతురు అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ లక్ష్మయ్య తెలిపిన ప్రకారం.. జల్‌పల్లి శ్రీరామ కాలనీకి చెందిన రత్లావత్ లక్ష్మణ్ చిన్న భార్య రాణి(30), కుమార్తె రిషిత(10) ఈ నెల 5వ తేదీన భర్త ఇంట్లో లేని సమయంలో ఇంట్లోని వస్తువులు తీసుకుని వెళ్లిపోయారు. ఫోన్ సైతం స్విచ్ఛాఫ్ చేశారు. స్థానికంగా గాలించినా ఫలితం లేకపోవడతో బుధవారం లక్ష్మణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో గాని 87126 62367 నంబర్‌లో గాని సమాచారం ఇవ్వాలన్నారు.
ఎత్‌మార్‌పల్లిలో తల్లీపిల్లలు
మొయినాబాద్‌రూరల్: తల్లీపిల్లలు అదృశ్యమైన ఘటన మొయినాబాద్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని ఎత్‌మార్‌పల్లి గ్రామానికి చెందిన సునుగంటి నవీన్ ఈ నెల 6వ తేదీన సాయంత్రం 7.30గంటల ప్రాంతంలో భార్య చందన(24)కు పలుమార్లు ఫోన్ చేశాడు. ఆమె ఫోన్ తీయకపోవడంతో ఇంటికి వచ్చిన తర్వాత మందలించాడు. మరుసటి రోజు భర్త బయటకు వెళ్లిన తర్వాత ఆమె తన పిల్లలు చేతన్(6), నిహాల్(4)ను తీసుకుని వెళ్లిపోయింది. తిరిగి ఇంటికి వచ్చి చూసే సరికి భార్య, పిల్లలు కనిపించకపోవడంతో చుట్టు పక్కల ప్రాంతాలు, బంధువులు, స్నేహితుల వద్ద వాకాబు చేశాడు. అనంతరం గ్రామంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా సాయంత్రం 5 గంటలకు మెహిదీపట్నం బస్సు ఎక్కినట్లు గుర్తించారు. బుధవారం నవీన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


