● ఎంపీడీఓ కార్యాలయంలో
రికార్టుల తనిఖీ
● ఉదయం నుంచిసాయంత్రం వరకు సోదాలు
ఇబ్రహీంపట్నం: మండల పరిషత్ కార్యాలయంపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఉదయం 10నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఫైళ్లు, రికార్డులను తనిఖీ చేశారు. నిధుల వినియోగం, రికార్డుల వివరాలను పరిశీలించారు. రాష్ట్ర విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ శిఖాగోయల్ ఆదేశానుసారం ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఇద్దరే అధికారులు..
ఉదయం 10 గంటలకు విజిలెన్స్ అధికారులు తనిఖీలకు రాగా, కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్, మరో అధికారి మాత్రమే ఉన్నట్లు తెలిసింది. ఎంపీడీఓ, సూపరింటెండెంట్, మిగితా సిబ్బంది అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఓ ట్రైనింగ్‌కు ఎంపీడీఓ, సూపరింటెండెంట్ సెలవులో ఉన్నట్లు సమాచారం.
వివరాలు గోప్యం..
ఎంపీడీఓ కార్యాలయంలోని రికార్డులను, వివిధ ఫైళ్లను సోదాలు చేసిన విజిలెన్స్ అధికారులు వివరాలను మాత్రం గోప్యంగానే ఉంచారు. తనిఖీల్లో ఏమైనా విశేషాలు ఉన్నాయా అని ప్రశ్నించగా సమాధానం చెప్పలేదు. సుమారు ఎనిమిది మందితో కూడిన ఈ బృందం సాయంత్రం వరకు సోదాలు నిర్వహించింది.


