ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం సురక్షితం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం సురక్షితం

Apr 9 2026 9:29 AM | Updated on Apr 9 2026 9:29 AM

మాతాశిశు మరణాల రేటు తగ్గించాలి

కలెక్టర్‌ దీపక్‌ తివారి

అనంతగిరి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం సురక్షితమని కలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సురక్షిత మాతృత్వం ద్వారా మాతాశిశు మరణాల రేటును తగ్గించడం సాధ్యమవుతుందన్నారు. గర్భిణులు ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తప్పనిసరిగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. కనీసం నాలుగు సార్లు వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రభుత్వం ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా వైద్యులు చొరవ తీసుకోవాలని సూచించారు. హోం డెలివరీలను తగ్గించి ఇన్‌స్టిట్యూషనల్‌ డెలివరీలను పెంచాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్‌ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. ఆశలు, ఏఎన్‌ఎం గ్రామస్థాయిలో గర్భిణులకు అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి స్వర్ణకుమారి, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ఆనంద్‌, డీఆర్‌డీఏ శ్రీనివాస్‌, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రాజ్యలక్ష్మి, ప్రోగ్రాం ఆఫీసర్లు రవీందర్‌, పవిత్ర, మహిళా సంక్షేమ శాఖ జిల్లా అధికారి కృష్ణవేణి అధికారులు పాల్గొన్నారు.

వసతులు కల్పించండి

వికారాబాద్‌ రైతు బజారులో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ దీపక్‌ తివారి అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని రైతు బజారును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూరగాయల విక్రయానికి షెడ్లు నిర్మించాలని సూచించారు. రోడ్లు, మంచి నీటి సౌకర్యం, మూత్ర శాలలు ఉండేలా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌ పంచాయతీ రాజ్‌ ఈఈ ఉమేష్‌ కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ విక్రమ్‌ సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దాలి

బంట్వారం: విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని కల్టెకర్‌ దీపక్‌ తివారి అన్నారు. బుధవారం కోట్‌పల్లి ఎంపీపీఎస్‌, అన్సాసాగర్‌లోని ప్రీ ప్రైమరీ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఎల్‌ఎన్‌, మధ్యాహ్న భోజనం అమలుపై ఆరా తీశారు. విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. సైన్స్‌ ల్యాబ్‌ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పీఆర్‌ అధికారులను ఆదేశించారు. అనంతరం కొత్తపల్లిలో ఆయిల్‌ పామ్‌ తోటను పరిశీలించారు. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. రైతులు లాభసాటి పంటలపై దృష్టి సారించాలన్నారు. అనంతరం కోట్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు. ప్రహరీ నిర్మాణానికి అంచనాలు పంపాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై హౌసింగ్‌ అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీఈఓ రేణుకాదేవి, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీఓ సురేందర్‌రెడ్డి, ఎంఈఓ చంద్రప్ప, హౌసింగ్‌ డీఈ సాజిద్‌, హార్టికల్చర్‌ ఆఫీసర్‌ కమల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement