యాలాల: మండల కేంద్రంలో చర్చి నిర్మాణ పనులను అడ్డుకునేందుకు యత్నిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య, పాస్టర్ కృపాకర్ పాల్ మాట్లాడుతూ.. 45 ఏళ్లుగా కొన్ని దళిత కుటుంబాలు క్రిస్టియన్ మతాన్ని స్వీకరించి ప్రార్థనలు చేసుకుంటున్నారు. వారు ప్రార్థనలు చేసుకుంటున్న చర్చి శిథిలావస్థలోకి చేరడంతో ఇటీవల పునఃనిర్మాణ పనులను ప్రారంభించారు. ఇందుకు సంబంధించి గతంలో పంచాయతీ నుంచి ఎన్‌ఓసీ తీసుకున్నామని గుర్తు చేశారు. కాగా కొందరూ కావాలనే చర్చి నిర్మాణ పనులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయంలో కలెక్టర్ స్పందించి చర్చి నిర్మాణ పనులు కొనసాగేలా చూడాలని మానవ హక్కుల కమిషన్‌ను కోరామన్నారు. చర్చి నిర్మాణ పనులను అడ్డుకుంటున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మలిగేరి నర్సింలు, నర్సమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప, చంద్రప్ప, పాపమ్మ, మహేశ్, శ్రీనివాస్, రాజు తదితరులు ఉన్నారు.
మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు


