భూసేకరణం | - | Sakshi
Sakshi News home page

భూసేకరణం

Apr 8 2026 8:08 AM | Updated on Apr 8 2026 8:08 AM

బుధవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 8లోu

న్యూస్‌రీల్‌

బుధవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026
ఇదీ నేపథ్యం

వికారాబాద్‌: లగచర్ల తరహాలో రైతులు భూ పోరాటానికి సిద్ధమయ్యారు. పరిగి మండలంలో ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన పారిశ్రామికవాడకు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. భూసేకరణ ప్రక్రియ రణరంగంగా మారుతోంది. నెల రోజులుగా అధికార.. ప్రతిపక్షాలు మాటల యుద్ధానికి తెరలేపాయి. భూ సేకరణ అంశం కాస్త రాజకీయ రంగు పులుముకుంది. గతంలో సీఎం సొంత నియోజకవర్గంలోని దుద్యాల్‌ మండలం లగచర్లలో మల్టీపర్పస్‌ ఇండస్ట్రియల్‌ పార్కు భూ సేకరణ విషయంలో అధికారులపై జరిగిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. తాజాగా పరిగి మండలం రాపోల్‌, కాళ్లాపూర్‌ గ్రామాల పరిధిలో మరో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీంతో భూములు కోల్పోతున్న రైతులు ఉద్యమబాట పట్టారు. నెలరోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు. వీరికి ప్రతిపక్షాలు మద్దతిస్తూ అండగా నిలుస్తున్నాయి.

ఉద్యమం.. ఉధృతం

భూ సేకరణ నోటిఫికేషన్‌తో రైతుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. తమ జీవనాధారం పోతుందని హైరానా పడుతున్నారు. సాగు భూములు ఇచ్చే ప్రసక్తే లేదంటూ ఉద్యమ బాట పట్టారు. నియోజకవర్గ కేంద్రం పరిగిలో రాస్తారోఖో, కలెక్టరేట్‌ ముట్టడితో తమ గళం వినిపించారు. పొలాల వద్ద టెంట్లు వేసుకొని దీక్షలు చేస్తున్నారు. వీరికి బీఆర్‌ఎస్‌ అగ్ర నాయకులు అండగా నిలుస్తున్నారు. పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి రైతుల పక్షాన పోరాడుతున్నారు. ఇటీవల రాపోల్‌, కాళ్లాపూర్‌ గ్రామాలను మాజీ మంత్రి సబితారెడ్డి సందర్శించి రైతుల దీక్షలకు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. భూసేకరణ ప్రకటనను తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సైతం బాధిత రైతులకు మద్దతు తెలిపారు. మాజీ మంత్రి హరీశ్‌రావు మంగళవారం ఆ గ్రామాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. అధైర్య పడొద్దని అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హరీశ్‌రావు పర్యటన నేపథ్యంలో జిల్లాలో హైటెన్షన్‌ నెలకొంది. బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. దీంతో జిల్లాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

బీఆర్‌ఎస్‌ నేతల హౌస్‌ అరెస్టు

హరీశ్‌రావు పర్యటన నేపథ్యంలో పోలీసులు బీఆర్‌ఎస్‌ నేతలను హౌస్‌ అరెస్టు చేశారు. పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డిని మంగళవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను పరిగి, ధారూరు తదితర పోలీస్టులకు తిప్పారు. పలువురు నాయకులు, రైతులను సైతం అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్‌ను వికారాబాద్‌లో హౌస్‌ అరెస్టు చేశారు, కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిని హైదరాబాద్‌లో హౌస్‌ అరెస్టు చేశారు. జిల్లాలో మొత్తం 120 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాళ్లాపూర్‌ సర్పంచ్‌ను సోమవారం అరెస్టు చేయడంతో ప్రజలు, రైతులు పెద్ద సంఖ్యలో పరిగి పోలీస్‌ ష్టేషన్‌కు చేరుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సాయంత్రం వదిలేశారు. ఎస్పీ స్నేహమెహ్ర పరిస్థితి చేయిదాటకుండా నిరంతరం పర్యవేక్షించారు. పరిగిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.

భూములు ఇచ్చేందుకు ససేమిరా అంటున్న అన్నదాతలు

లగచర్ల తరహాలో పోరాటానికిసిద్ధమైన రాపోల్‌, కాళ్లాపూర్‌ రైతులు

ఉధృతమవుతున్న ఆందోళనలు

హరీశ్‌రావు పర్యటన నేపథ్యంలోబీఆర్‌ఎస్‌ నేతల అరెస్ట్‌

పరిగి పారిశ్రామిక వాడకు అడ్డంకులు

నెల రోజుల క్రితం పరిగి మండలంలో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 1,197 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించింది. ఇందులో 260 ఎకరాల పట్టా, 937 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. కాళ్లాపూర్‌ మండలంలో 159.25 ఎకరాల పట్టా భూమి, 428.05 ఎకరాల ప్రభుత్వ భూమి సేకరించనున్నారు. రాపోల్‌ రెవెన్యూ పరిధిలో 101.08 ఎకరాల పట్టా భూములు.. 509 ఎకరాల ప్రభుత్వ భూమిని తీసుకోవాలని నిర్ణయించారు. ఈ ప్రాంత సమీపం నుంచే ఔటర్‌, రీజినల్‌ రింగ్‌ రోడ్లను కలుపుతూ రేడియల్‌ రోడ్డు వెళ్లనుంది. మరో వైపు పరిగి – షాద్‌నగర్‌ రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించేందుకు టెండర్లు పూర్తి చేశారు. రాపోల్‌, కాళ్లాపూర్‌ శివారులో నిర్మించతలపెట్టిన పారిశ్రామిక వాడకు రోడ్డు కనెక్టివిటీ కూడా మెండుగా ఉండటంతో ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్టు సమాచారం.

నోటిఫికేషన్‌ వెనక్కి తీసుకోవాలి

రైతులకు అన్యాయం చేయాలని చూస్తే బీఆర్‌ఎస్‌ ఉపేక్షించదు. భూసేకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. బాధిత రైతులకు బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుంది. వారి తరఫున పోరాటం చేస్తాం. పరిశ్రమల పేరిట పంట పొలాలను లాక్కుంటే చూస్తూ ఊరుకోం.

– కొప్పుల మహేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పరిగి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement