● కలెక్టర్ దీపక్ తివారి
● విద్యార్థులతో అవగాహన ర్యాలీ
నాణ్యమైన
ఆహారంతో
అనంతగిరి: నాణ్యమైన ఆహారం తీసుకున్నప్పుడే మెరుగైన జీవనం సాధ్యమవుతుందని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. సోమవారం ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా హెల్త్ వీక్.. ఈట్ రైట్ ష్టే హెల్తీ అనే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని సంగం లక్ష్మీబాయి ఉన్నత పాఠశాల నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యంపై దాదాపు 90 శాతం ప్రభావం చూపుతుందన్నారు. బయట లభించే కలుషిత, రసాయన కారక ఆహారం తీసుకోవడం ద్వారా చిన్న వయస్సులోనే క్యాన్సర్, గుండెపోటు వంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నాణ్యమైన ఆహారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జంక్ ఫుడ్‌కు స్వస్తి పలకాలన్నారు. తాజా కూరగాయలు, వేడి భోజనం, ఇంట్లో వంటకాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. హోటళ్లు, బేకరీలు, ఫుడ్ సెంటర్లలో లభించే తిను బండారాలు, భోజనాలు, అల్పాహారాలను జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అంగన్‌వాడీ టీచర్లకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లు వార్డెన్లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సుధీర్, డీఎంహెచ్‌ఓ స్వర్ణకుమారి, ఫుడ్ సేఫ్టీ అధికారి జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం పరిశీలన
జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంను సోమవారం కలెక్టర్ దీపక్ తివారి పరిశీలించారు. ఈవీఎంలు, బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, ఎన్నికల సామగ్రి భద్రపరిచిన గదులను కుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రతలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం రిజిస్టర్లను పరిశీలించి సంతకాలు చేశారు. కార్యక్రమములో ఆర్‌డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ లక్ష్మినారాయణ, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు నెమత్ హలీ తదితరులు పాల్గొన్నారు.
కంట్రోల్ రూం ఏర్పాటు
తాగునీటి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 08416235291కు కాల్ చేసి నీటి సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.00 వరకు పైనంబరులో అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు.
గుర్తింపు పత్రాలు అందజేత
ట్రాన్స్‌జెండర్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ట్రాన్స్‌జెండర్లకు అధికారిక గుర్తింపు సర్టిఫికెట్ల పంపిణీ చేశారు. ఈ సర్టిఫికెట్ల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్య, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. సమాజంలో సమాన హక్కులు కలిగిన వారేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో శిశు సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణికి 120 ఫిర్యాదులు
ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి 120 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాధాన్యత క్రమంలో సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, ఆర్‌డీఓ మంగీలాల్, జెడ్పీ సీఈఓ సుధీర్, ఆర్‌డీఓ వాసుచంద్ర, డీఆర్‌డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


