గన్‌ఫౌండ్రీ: వేసవి సెలవులలో పోటీ పరీక్షల పేరుతో కొనసాగుతున్న కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) డిమాండ్ చేసింది. సోమవారం పీడీఎస్‌యు ఆధ్వర్యంలో ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్న కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ.. నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యు రాష్ట్ర అధ్యక్షులు కె.పృథ్వి మాట్లాడుతూ.. విద్యా సంవత్సరం పూర్తి కాకముందే కొన్ని కార్పొరేట్ కళాశాలలు ముందస్తు అడ్మిషన్లు తీసుకుంటూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం ఇంటర్ బోర్డు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థి నాయకులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు.


