చెరువులో పడి బీబీఏ విద్యార్థి మృతి
శంకర్‌పల్లి: వారంతా చెరువుగట్టున సరదాగా పుట్టినరోజు వేడుకలు జరుపుకొనేందుకు వెళ్లారు. ఆహ్లాదభరితంగా సాగుతున్న సమయంలోనే అందులోని ఓ వ్యక్తి తటాకంలో పడి మృతి చెందడంతో అంతులేని విషాదం నెలకొంది. ఈ సంఘటన సోమవారం సాయంత్రం మండలంలోని ప్రొద్దటూరులో చోటు చేసుకుంది. మోకిల సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం వెలిమల గ్రామానికి చెందిన ప్రణవ్‌రెడ్డి(21) శంకర్‌పల్లి మండలం దొంతాన్‌పల్లిలో ఇక్ఫాయ్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బీబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం తోటి స్నేహితుడి బర్త్‌డే ఉండడంతో పది మంది కలిసి సెలబ్రేట్ చేసేందుకుగాను ప్రొద్దటూరు చెరువు వద్దకు వెళ్లారు. వేడుకలు పూర్తయిన తర్వాత ఒక్కొక్కరు చెరువు వద్దకు వెళ్లి చేతులు కడుక్కుంటున్నారు. ప్రణవ్‌రెడ్డి సైతం వెళ్లగా చెరువు లోతును అంచనా వేయలేక ప్రమాదవశాత్తు దాంట్లో పడిపోయాడు. ఈత రాకపోవడం, ఊపిరి అందకపోవడంతో మునిగిపోయాడు. స్నేహితులు రక్షించేందుకు విఫలయత్నం చేశారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలకు రప్పించి, మృతదేహన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


