వేతనాలు అందక ఇబ్బందులు
● క్షేత్రస్థాయిలో పశువులకు
ప్రథమ చికిత్స చేస్తున్న గోపాలమిత్రలు
● ఎనిమిది నెలలుగా జీతాలు అందని వైనం
కొడంగల్ రూరల్: పశు సంపద రక్షణలో కీలకపాత్ర పోషించే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని గోపాలమిత్రలు కోరుతున్నారు. గౌరవ వేతనంతో సేవలందిస్తుండగా ఎనిమిది నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అందించే వేతనం రాకపోవడంతో అప్పులతో కుటుంబాలను నెట్టుకొస్తున్నామని పేర్కొంటున్నారు.
పోషకులకు చేయూత
2000 సంవత్సరంలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ డిస్ట్రిక్ట్ లైవ్ స్టాక్ డెవలప్‌మెంట్ ఏజన్సీ(డీఎల్డీ) ద్వారా గోపాలమిత్ర వ్యవస్థను ఏర్పాటు చేశారు. జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గోపాలమిత్రలు పశువులకు కృత్రిమ గర్భధారణ చేయడంతోపాటు పాడి రైతులకు అందుబాటులో ఉంటూ పశువులకు ప్రథమ చికిత్స అందిస్తున్నారు. రైతుల ఇళ్లకు వెళ్లి పశువులకు కృత్రిమ గర్భధారణ టీకాలు, నట్టల నివారణ మందులు వేయడం, గర్భకోశ వ్యాధులు, జబ్బువాపు, గొంతువాపు నివారణకు హెచ్‌ఎస్ టీకాలు వేయడంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన, విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తారు.
గోపాల మిత్రలకు టార్గెట్
గోపాలమిత్ర సిబ్బంది నెలకు 60 నుంచి 80 పశువులకు కృత్రిమ గర్భధారణ(సెమన్) చేయాలి. దీనికి రూ.40 చొప్పున రైతుల నుంచి వసూలు చేసి ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలి. ప్రతి నెలా నిర్దేశించిన లక్ష్యాన్ని గోపాలమిత్రలు పూర్తి చేయాలి. లేదంటే నెల జీతంలో కోత తప్పదని వాపోతున్నారు.
ఆర్థిక ఇబ్బందులు
గ్రామీణ ప్రాంత పశు సంపద, పాడి అభివృద్ధికి రాష్ట్రంలో పశు సంవర్ధక శాఖలో 1530 మంది గోపాలమిత్రలు పనిచేస్తున్నామని, క్షేత్రస్థాయిలో రైతులు తమను సంప్రదించిన వెంటనే పశువులకు ప్రథమ చికిత్స చేయిస్తారని పేర్కొంటున్నారు. వేతనాలు అందకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందిస్తూ వేతనాలను విడుదల చేయాలని కోరుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 2018లో రూ.3,500 నుంచి రూ.8,500 వరకు వేతనాలు పెరిగాయని, 2022 అక్టోబర్‌లో రూ.11,050లకు పెంచారని పేర్కొంటున్నారు. అయితే గత ఎనిమిది నెలలుగా వేతనాలు లేకపోవడంతో ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ భద్రత లేకపోవడంతో పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం లేకుండాపోతుందని వాపోతున్నారు.
ఉద్యోగ భద్రత కల్పించాలి
గ్రామీణ ప్రాంత పశు సంపద, పాడి అభివృద్ధికి పనిచేస్తున్నాం. పశు సంవర్ధకశాఖలో ఖాళీగా ఉన్న ఓఎస్(అటెండర్) పోస్టులకు సీనియర్ గోపాలమిత్రలకు అవకాశం కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలను కల్పించాలి.
– రవీందర్, గోపాలమిత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
వేతనాలు అందక ఇబ్బందులు


