ఆలుకు ఇదే అదును
● సస్యరక్షణ చర్యలు పాటించాలి
● మూడు నెలల్లో పంట చేతికొచ్చే అవకాశం
● ఉద్యాన శాఖ అధికారి అక్షితరెడ్డి
మోమిన్‌పేట: కూరగాయ పంటలలో అతి తక్కువ కాల పరిమితిలో కోతకు వచ్చేది ఆలు(బంగాళదుంప) పంట మాత్రమే. విత్తిన 90 రోజుల నుంచి 110 రోజులలో పంట కోతకు వస్తుంది. కానీ చాలా మంది రైతులు 70 రోజులకే మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఆలు పంటను సాగు చేసుకొనేందుకు శీతాకాలం అనువైనది. ఎంత చలి ఉంటే అంత ఎక్కవ దిగుబడులు ఆలులో సాధ్యమని మండల ఉద్యాన శాఖ అధికారి అక్షితరెడ్డి తెలిపారు. ప్రస్తుతం అలు సాగుకు అనుకూలమైన వాతావరణం ఉందన్నారు.
ఎకరాకు 15 టన్నులు
మండలంలోని కోల్కుంద, మోమిన్‌పేట, రావులపల్లి, ఎన్కతల, సయ్యద్‌అల్లిపూర్ గ్రామాలలో ఆలును విరివిగా సాగు చేస్తున్నారు. సరియైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు. నాణ్యమైన విత్తన రకాలు ఎంచుకోవాలి. కుఫ్రీ పుకరాజ్(166), కుఫ్రీ క్యాథి, కుఫ్రీ మోహన్(302) లాంటి విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. భూమిని బాగా రెండు నుంచి మూడు సార్లు లోతుగా దున్నుకోవాలి. ఎకరాకు 12టన్నుల బాగా మాగిన సేంద్రియ ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకొని కలియ దున్నాలి. కొంత మంది రైతులు పచ్చిరొట్ట ఎరువులైన జినుగ, జనుములను సాగు చేసి ఏపుగా పెరిగిన తర్వాత కలియ దున్ని ఆలును సాగు చేస్తున్నారు. ఎకరాకు ఏడు క్వింటాళ్ల విత్తనం సరిపోతుంది. బోదెలను ఏర్పాటు చేసుకొని విత్తుకొవాలి. ఎరువుల యాజమాన్యం పాటించి డ్రిప్ ద్వారా నీటిని అందించాలి. ఆలు తెలుతున్న సమయంలో మట్టితో కప్పాలి, లేనిచో ఆలుగడ్డలు పచ్చగా మారుతుంది. దీంతో రైతులకు నష్టం వాటిల్లుతుంది. విత్తుకొన్న 90 రోజుల నుంచి 110రోజులలో పంట కోతకు వస్తుంది. అప్పుడే మార్కెట్‌కు తరలించాలి. ఎకరాకు 9టన్నుల నుంచి 15టన్నుల వరకు దిగుబడులు వస్తాయి.
విత్తన రాయితీ ఇవ్వాలి
విత్తనం క్వింటాళుకు రూ.3,600 నుంచి రూ.4వేల వరకు కొనుగోలు చేయాల్సి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. చాలా మంది పెట్టుబడి అధికం కావడం వలన సాగుకు దూరంగా ఉంటున్నామన్నారు. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే అధిక సంఖ్యలో రైతులు సాగుకు ముందుకు వస్తారు. విత్తనాలను ఆగ్రా నుంచి తీసుకువచ్చేందుకు ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంది. అందుకు ప్రభు త్వం విత్తన రాయితీ ఇవ్వాలని కర్షకులు కోరుతున్నారు.
ఆలుకు ఇదే అదును


