ఇంటి నిర్మాణంతో ఉపాధి
● పనులకు ఉపాధి హామీ కింద కూలీలు
● లబ్ధిదారులకు తగ్గనున్న ఆర్థిక భారం
దౌల్తాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఉపాధి హామీ కింద అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జాబ్‌కార్డు ఉన్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఇది ఆర్థికంగానే కాక కూలీల కొరత అధిగమించడానికి తోడ్పడనుంది. ఇంటి నిర్మాణంలో ఉపాధి హామీ పథకం కింద 90 రోజుల పాటు పనులు చేసేందుకు అనుమతి ఉంది. ఒక ఇంట్లో ఇద్దరికి ఆపైన జాబ్‌కార్డులు ఉంటే వారిలో ఒకరికి మత్రమే పథకం వర్తిస్తుంది. ప్రస్తుతం ఉపాధి కూలీలకు రోజుకు రూ.307 వేతనం చెల్లిస్తున్నారు. ఈ లెక్కన జాబ్‌కార్డు ఉన్న ఇంటి లబ్ధిదారుడికి రూ.27,630 ప్రయోజనం కలగనుంది.
290 ఇళ్లు మంజూరు
ఇల్లు కట్టుకునే లబ్ధిదారులకు బేస్‌మెంట్ స్థాయి నిర్మాణం వరకు 40 రోజులు, పైకప్పు స్థాయి వరకు 50 రోజుల పనిదినాలు వినియోగించుకునే వెసులుబాటు ఉంది. రెండు మూడు దశల్లో మంజూరయ్యే ఇందిరమ్మ ఇళ్లకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఉపాధి హామీ జాబ్‌కార్డులు 8వేలు ఉండగా 22వేల మంది కూలీలు ఉన్నారు. మండలంలో మొత్తం 290 ఇళ్లు మంజూరయ్యాయి. ఈ పథకంతో లబ్ధిదారులకు ఆర్థిక భారం తగ్గుతుంది.
అర్హుల ఎంపిక ఇలా
అర్హులైన లబ్ధిదారుల జాబితాలను ఎంపీడీఓలు రూపొందిస్తారు. ఈ కసరత్తు పూర్తయ్యాక జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అనుమతి తీసుకుని గృహ నిర్మాణ శాఖ పీడీకు పంపుతారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అనుసంధానమైన కూలీలు ఇతర పనులకు వెళ్లడానికి అవకాశం ఉండదు. మూడు స్థాయిల్లో పనుల ఫొటోలను లబ్ధిదారుల ఫొటోతో పాటు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. పనులు పూర్తయ్యాక పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరిస్తూ చెల్లింపులకు అనుమతించడంతో ఈ ప్రక్రియ పూర్తవుతుంది.


