రైలు పట్టాల పక్కన మృతదేహం లభ్యం
తాండూరు టౌన్: రైలు పట్టాల పక్కన ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు వికారాబాద్ రైల్వే పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయం బషీరాబాద్ మండలం మంతట్టి రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాల పక్కన మృతదేహం పడి ఉన్నట్లు వచ్చిన సమాచారం మేరకు రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గుర్తు తెలియని సుమారు 30 ఏళ్ల ఓ మగ మనిషి మృతదేహం పడి ఉందని, ఒంటిపై నీలి రంగు చొక్కా, నారింజ రంగు నిక్కర్ ఉందన్నారు. ఒంటిపై ఎలాంటి గాయాలు లేవన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 7702629707, 8712513584 ఫోన్ నంబర్‌లకు సమాచారం ఇవ్వాలన్నారు.
‘డబుల్’ లబ్ధిదారులను ఇబ్బంది పెట్టొద్దు..
హిమాయత్‌నగర్: రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్(ఆర్‌డబ్ల్యూఏ) పేరుతో డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారులను ప్రభుత్వం ఇబ్బంది పెట్టొద్దని మేడ్చల్– మల్కాజిగిరి డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల జేఏసీ విజ్ఞప్తి చేసింది. ఆదివారం బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ కన్వీనర్లు నర్సింగరావు, పెంటయ్య, వినోద్ కుమార్, శేఖర్, శ్రీశైలం యాదవ్, శ్రీనివాస్‌చారి, వెంకటేష్, నరేష్ గౌడ్ మాట్లాడారు. ఇటీవల అహ్మద్‌గూడ డబుల్ బెడ్‌రూం ఇళ్లను జిల్లా కలెక్టర్ సందర్శించి 18 సమస్యలను గుర్తించారని, వాటిని పరిష్కరిస్తామని చెప్పి ఇంతవరకూ పట్టించుకోలేదని అన్నారు. భూగర్భ డ్రైనేజ్, మంచినీటి పైపుల మరమ్మతు, నిర్వహణ, వీధిదీపాల కరెంట్ బిల్లు, పార్క్, ఎస్‌టీపీ మెయింటెనెన్స్ చార్జీలను లబ్ధిదారులపై విధిస్తే ఒక్కొక్కరికి నెలకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు భారం పడుతుందని తెలిపారు. ఈ జిల్లాలో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పేదలకు 13 కాలనీల్లో 27 వేల 472 డబుల్ బెడ్‌రూం ఇళ్లను కేటాయించిందన్నారు. బహదూర్‌పల్లి, అహ్మద్‌గూడ, మురహరపల్లిలోని డబుల్ బెడ్‌రూం ఇళ్లలో కనీస సౌకర్యాలు లేవని పేర్కొన్నారు. కొంతమందికి పట్టాలు ఇచ్చినప్పటికీ ఇంతవరకు ఇళ్లు కేటాయించలేదన్నారు.


