ఆయిల్ మిల్లు.. ఆరోగ్యానికి చిల్లు
కాలుష్య కారక సంస్థపై చర్యలకు గ్రామస్తుల డిమాండ్
మంచాల: ప్రజారోగ్యానికి ముప్పుగా మారిన ఆయిల్ మిల్లుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నోముల గ్రామ పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. ఆదివారం గ్రామంలో మిల్లుకు సంబంధించిన లారీని అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మిల్లు నుంచి వెలువడుతున్న వ్యర్థాల వలన కాలుష్యం బారిన పడుతున్నామన్నారు. దుమ్ము, ధూళితో శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నామని తెలిపారు. 25 టన్నుల లోడుతో రావాల్సిన లారీలు 60 నుంచి 70 టన్నులతో వస్తున్నాయని ఆరోపించారు. అధిక బరువు వలన రహదారులు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి, మిల్లు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఇదే విషయమై రెండు రోజుల క్రితం పంచాయతీ కార్యదర్శి సుభద్ర దేవికి వినతిపత్రం అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు జయాసందం, నాయకులు వి.ఆంజనేయులు, ఎర్ర అశోక్, చక్రపాణి, రవిందర్, యాదయ్య, జంగయ్య, జైపాల్‌రెడ్డి, వెంకటేశ్‌గౌడ్, అరుణ్‌కుమార్, శ్రీనివాస్ గౌడ్, గంట తదితరులు పాల్గొన్నారు.


