
విచారణ.. మమ!
● షోకాజ్‌తో షో చేసిన
వ్యవసాయ అధికారులు
● ‘అధిక ధరల’ వ్యవహారం
● చివరికి మునిగింది రైతులే!
బషీరాబాద్: ప్రభుత్వ నిబంధనలను లెక్కచేయకుండా, అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తూ తమను మోసం చేస్తున్న వ్యాపారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రైతులు మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం బషీరాబాద్ రైతు వేదిక వద్దకు చేరుకుని వ్యవసాయ శాఖ అధికారులను నిలదీశారు. ఒక్క బస్తా యూరియా కోసం రోజుల తరబడి క్యూలైన్‌లో నిలబడ్డామని, ఇదే అదనుగా దుకాణం యజమానులు ఇష్టానుసారం ఎరువుల ధరలు పెంచి విక్రయించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయమై విచారణ చేపట్టిన అధికారులు చివరికి వ్యాపారులకే వంతపాడటంపై నిరసన తెలిపారు.
ఏం జరిగిందంటే..
బషీరాబాద్‌లోని ఓ ఫర్టిలైజర్ షాపులో యూరియా, డీఏపీ అధిక ధరలకు విక్రయిస్తున్నారని గత గురువారం పలువురు రైతులు వ్యవసాయ అధికారులకు మౌఖికంగా ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన మండల వ్యవసాయ అధికారి సదరు షాపు షాపు యజమానికి శనివారం షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఐదు రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వాలని రైతులు, మీడియా ముందు ఆదేశాలు జారీచేశారు. బుధవారం గడువు ముగియడంతో సదరు షాపు యజమాని వివరణ ఇచ్చుకున్నారు. యూరియా, డీఏపీ ధరలు తెలియక ఎక్కువ ధరకు విక్రయించామని, మరోసారి పొరపాటు కాకుండా చూస్తానని, బిల్లు బుక్కు కోసంఆర్డర్ ఇవ్వగా ప్రింటింగ్‌లో జాప్యం కావడంతో రశీదులు ఇవ్వలేకపోయామని దుకాణ యజమాని సంజాయిషీ ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు కర్షకులు రైతు వేదికకు చేరుకుని అధికారులను నిలదీశారు. ఎక్కువ ధరలకు అమ్మినట్లు దుకాణాదారులే ఒప్పుకొన్నారని చెబుతున్నా చర్యలు ఎందుకు తీసుకోలేదని ధ్వజమెత్తారు. ఇదిలా ఉండగా తాండూరు ఏడీఏ కూడా సదరు షాపు యజమానిని వెనకేసుకురావడంపై రైతులు అసహనం వ్యక్తంచేశారు. ఇదే విషయమై ఏడీఏను అడగగా తమపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని, మీడియాలో వచ్చిన కథనాలతో దుకాణ యజమానిపై చర్యలు తీసుకోలేమని చెప్పడం గమనార్హం. ఇదిలా ఉండగా పలువురు రైతులు మాట్లాడుతూ.. తమకు అండగా నిలవాల్సిన అధికారులు, నాయకులు వ్యాపారులకే మద్దతు పలకడం ఏమిటని వాపోయారు. గట్టిగా నిలదీద్దామంటే తమకు ఎరువులు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతారని, అత్యవసరమైతే ఉద్దెర(క్రెడిట్) ఇవ్వరని పలువురు తెలిపారు. మరికొందరు మాత్రం అధిక ధరల విషయమై చర్యలు తీసుకోకపోతే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.