
మా భూములను కాపాడండి
అనంతగిరి/మోమిన్‌పేట: ట్రిపుల్ ఆర్ భూ బాధితులకు బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భరోసా ఇచ్చారు. పార్టీ అండగా ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందరాని హామీ ఇచ్చారు. మండలంలోని టేకులపల్లి, దేవరంపల్లి గ్రామాలకు చెందిన పలువురు రైతులు బుధవారం నగరంలోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసి ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్చడం ద్వారా తమ భూములు పోతున్నాయని, ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దల ఆస్తులను కాపాడేందుకు పేద రైతుల పొట్ట కొడుతోందని ఆరోపించారు. రైతులకు సమాచారం ఇవ్వకుండా సర్వే చేయడం ఏమిటని ప్రశ్నించారు. అభివృద్ధికి పేదల భూములే కావాలా అని నిలదీశారు. రైతులు మెచ్చేలా పరిహారం చెల్లించిన తర్వాతే భూములు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. బలవంతపు భూసేకరణ మంచిది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. గతంలో ఓఆర్‌ఆర్ విషయంలో కూడా ఇదే విధంగా సొంత ఎజెండాతో పేద రైతులను ముంచిందన్నారు. ఇప్పుడు అలైన్‌మెంట్ మార్చడం వెనుక పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్థన్‌రెడ్డి, మర్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్, భూములు కోల్పోతున్న రైతులు ఉన్నారు.