
పశువులకు మెరుగైన సేవలు
తాండూరు రూరల్: స్థానిక పశు వైద్యశాలలో అధికారి లేరని సాక్షి దినపత్రికలో ఇటీవల ప్రచురితమైన ‘ఏడీఏ లేక.. సేవలు సాగక’ వార్తకు ఉన్నతాధికారులు స్పందించారు. ధారూరు మండలం కుక్కింద పశువైద్యశాల సబ్ సెంటర్‌లో పని చేస్తున్న ఫ్యారమేట్ సైదులును తాండూరు పశువైద్యశాల ఏడీఏ కార్యాలయానికి డిప్యూటేషన్‌పై పంపించారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారంలో మూడు రోజులు కుక్కింద పశువైద్యశాలలో.. మరో మూడు రోజులు తాండూరు ఏడీఏ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని సైదులను ఆదేశించారు. ఇక నుంచి తాండూరులో గురు, శుక్ర, శనివారం మూడు రోజులు అందుబాటులో ఉండనున్నారు.
పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడి మృతి
దిక్కులేనివారైన భార్యాపిల్లలు
తాండూరు రూరల్: అనారోగ్యంతో ఓ పంచాయతీ కార్మికుడు మృతి చెందాడు. దీంతో భార్య, కూతురు అనాథలయ్యారు. పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన బోడ సంగప్ప(33) పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. పదిహేను రోజుల క్రితం జాండిస్‌కు గురికావడంతో పాటు కిడ్నీలో ఇన్‌ఫెన్షన్ సోకి ఉస్మానియా ఆస్పత్రిలో చేరాడు. ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి లాలప్ప, కారోబార్ నర్సిరెడ్డి నగరానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంగప్ప తల్లితండ్రులు కూడా పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తూనే మృతిచెందారు. సంగప్ప మృతితో అతని భార్య అక్షిత, ఏడాదిన్నర కూతురు ఆరోగ్య దిక్కులేనివారయ్యారు. ప్రభుత్వం వీరిని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. శుక్రవారం పెద్దేముల్‌లో సంగప్ప అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
చెట్టు కొమ్మ విరిగిపడి విద్యార్థికి గాయాలు
బషీరాబాద్: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అండర్–14 క్రీడా పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన ఓ విద్యార్థిపై గురువారం చెట్టు కొమ్మ విరిగి పడింది. దీంతో అతడి తలకు తీవ్రగాయమైంది. వివరాల్లోకి వెళితే.. జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కింద యాలల, బషీరాబాద్, తాండూరు టౌన్, తాండూరు రూరల్ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఎస్‌జీఎఫ్ క్రీడా పోటీలు జరుగుతున్నాయి. తాండూరు పట్టణం వాల్మీకీ నగర్‌కు చెందిన సుశాంత్ అనే విద్యార్థి మండలంలోని జినుగుర్తి మోడల్ స్కూల్ నుంచి కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు హాజరయ్యాడు. తోటి విద్యార్థులతో పాఠశాల మైదానంలో చెట్టు కింద నిలబడ్డారు. అదేసమయంలో అకస్మాత్తుగా చెట్టు కొమ్మ విరిగికింద పడింది. మరో ఇద్దరు విద్యార్థులతో నిలబడి ఉన్న సుశాంత్ తలపై కొమ్మ పడింది. దీంతో విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. ఉపాధ్యాయులు వెంటనే చికిత్స నిమిత్తం బాలుడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు రెఫర్ చేశారు. దీంతో ఫైనల్ కబడ్డీ పోటీలు వాయిదా పడ్డాయి.
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
ఇబ్రహీంపట్నం రూరల్: నిర్మానుష్య ప్రదేశంలో పేకాట ఆడుతుండగా ఎస్‌ఓటీ, ఆదిబట్ల పోలీసులు దాడి చేసి, ఐదుగురు జూదరులను అరెస్టు చేశారు. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ రవికుమార్ కథనం ప్రకారం.. రావిర్యాల సమీపంలోని మైల్ స్టోన్ వెంచర్‌లో పలువురు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో సుజీవన్, తిరుపతయ్య, మహేష్, శేఖర్, సురేష్‌లను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ.13,250 నగదు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పశువులకు మెరుగైన సేవలు

పశువులకు మెరుగైన సేవలు

పశువులకు మెరుగైన సేవలు