
మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
అనంతగిరి: మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. బుధవారం వికారాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన స్వస్త్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ మెగా హెల్త్ క్యాంప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో 56 రకాల పరీక్షలు, 17 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. అనంతరం వికారాబాద్‌లోని బాలికల ఉన్నత పాఠశాలలో బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా ఆధునీకరణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, డీఎంహెచ్‌ఓ లలితాదేవి తదితరులు పాల్గొన్నారు.