
ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం
దోమ: సామాన్య శాస్త్రం బోధిస్తున్న రాములు ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికవ్వడం హర్షణీయమని జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆంజనేయులు పేర్కొన్నారు. బుధవారం దోమ మండల పరిధిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో తోటి ఉపాధ్యాయులతో కలిసి ఆయన శాలువాకప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ..ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన చేస్తున్నారన్నారు. జిల్లా స్థాయిలో తమ పాఠశాల ఉపాధ్యాయుడికి అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు.
పైప్‌లైన్ లీకేజీలకు మరమ్మతులు
బషీరాబాద్: రోడ్డు విస్తరణలో పగిలిపోయిన తాగునీటి పైప్‌లైన్‌కు పంచాయతీ సిబ్బంది బుధవారం మరమ్మతు పనులు చేపట్టారు. వారం రోజుల క్రితం రోడ్డు విస్తరణ కోసం నిర్మాణ పనులు చేపట్టడంతో పైప్‌లైన్లకు లీకేజీలు ఏర్పడ్డాయి. దీంతో తాగునీటి సరఫరాలేక ఐదు రోజులుగా ప్రజులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరమ్మతు పనులు పూర్తికావడంతో నీటిసరఫరా పునరుద్ధరించినట్లు కార్యదర్శి జయకర్ తెలిపారు.
న్యాయం చేయాలని వినతి
శంకర్‌పల్లి: వ్యవసాయం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1967లో తమకిచ్చిన నాలుగు ఎకరాల భూమిని కొంతమంది కబ్జా చేస్తున్నారని మండలంలోని పొన్నగుట్టతండాకు చెందిన కిషన్, శంకర్, రాంసింగ్, ఆమ్రియాలు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. 1967లో ప్రభుత్వం తమ తండ్రి వాల్యకి నాలుగు ఎకరాల భూమిని ఇచ్చింది. అప్పటి నుంచి దాన్ని ఏళ్లుగా సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాం. గత కొన్ని నెలల నుంచి మోకిల తండాకు చెందిన ఓ వ్యక్తి తమని భయభ్రాంతులకు గురి చేస్తూ, పొలం లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నాడు. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ మంగళవారం పొలం వద్ద వారు పనులు చేస్తున్నారని సమాచారం అందింది. అక్కడికి మేము వెళ్లగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మోకిల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఇరువురు మాట్లాడుకోవాలని చెబుతున్నారే తప్పా.. కేసు నమోదు చేయడం లేదన్నారు.